అనివార్యమయ్యే ఆర్టీసీ టికెట్లపై డీజిల్‌ సెస్‌

APSRTC tickets prices Palle Velugu City Ordinary Services - Sakshi

నేటి నుంచి అమల్లోకి..

పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో రూ.2 చొప్పున సెస్‌

ఎక్స్‌ప్రెస్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో రూ.5

సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 

పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస చార్జీ రూ.10

తప్పనిసరి పరిస్థితుల్లోనే పెంపు: చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంధన సంస్థలు డీజిల్‌ ధరలను అమాంతం పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ టికెట్లపై డీజిల్‌ సెస్‌ విధించాల్సి వస్తోందని ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 2019లో లీటర్‌ డీజిల్‌ రూ.67 ఉండగా ప్రస్తు తం రూ.107కు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం విజయవాడలోని బస్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఒక్కో టికెట్‌పై డీజిల్‌ సెస్‌ నిమిత్తం రూ.2 చొప్పున, ఎక్స్‌ప్రెస్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్‌ సర్వీసుల్లో రూ.5 చొప్పున, సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 చొప్పున డీజిల్‌ సెస్‌ వసూలు చేయనున్నట్లు తెలి పారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస టికెట్‌ ధర రూ.10గా ఉంటుందన్నారు.  

పెరిగిన డీజిల్‌ సెస్‌ చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. అమాంతం పెరిగిన డీజిల్‌ ధరలతో ఆర్టీసీపై ఏటా రూ.1,100 కోట్లు అదనంగా ఆర్థికభారం పడుతోందని చెప్పారు. డీజిల్‌ సెస్‌ ద్వారా ఏడాదికి రూ.720 కోట్లు సమకూరినప్పటికీ అదనంగా దాదాపు రూ.400 కోట్ల భారాన్ని ఆర్టీసీ భరించాల్సి వస్తోందని వివరించారు. డీజిల్‌ ధరలు తగ్గితే సెస్‌ తొలగించే విషయాన్ని పరిశీలిస్తామన్నా రు. తెలంగాణలో కూడా డీజిల్‌ సెస్‌ విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్‌ పరిస్థితుల్లో గత రెండేళ్లలో ఆర్టీసీ దాదాపు రూ.5,680 కోట్ల రాబడి కోల్పోయిందని తెలిపారు. అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రయోజనాల కోసం బీవోటీ ప్రాతిపదికన కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. కార్గో సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించడానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. 

దయచేసి అర్థం చేసుకోవాలి.. 
డీజిల్‌ ధరలు అమాంతం పెరగడంతో అనివార్యం గా సెస్‌ విధించాల్సి రావటాన్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని  కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కోవిడ్‌ గడ్డు పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామన్నారు. ప్రభుత్వం ప్రతి నెల రూ.300 కోట్ల వరకు జీతాల భారాన్ని భరిస్తోందని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top