ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వయసు 47 ఏళ్లకు పెంపుపై సర్కారు మౌనం
ప్రతిపక్షంలో ఉండగా పెంచాలని డిమాండ్ చేసిన లోకేశ్
అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఆ ఊసెత్తని వైనం
వయసు పెంపుపై ప్రభుత్వానికి లేఖ రాసిన ఏపీపీఎస్సీ
రెండు నెలలుగా నిర్ణయం ప్రకటించకుండా దాటవేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపుపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించిన పాలకులు, వారి వయో పరిమితి పెంపుపై మాత్రం స్పందించకపోవడంపై ఆందోళన నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలకు 34 ఏళ్ల వయసు ఉండగా, ఈ పరిమితిని కొన్నేళ్లుగా 42 ఏళ్లకు పెంచుతున్నారు. అయితే, 2023లో సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్లకు 44 ఏళ్లకు పెంచాలని గత ప్రభుత్వంలో సీఎంకు నారా లోకేశ్ లేఖ రాశారు.
టీడీపీ ఎమ్మెల్సీలు సైతం పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖలు రాశారు. ఎన్నికల సమయంలో లోకేశ్ నిర్వహించిన యువగళం సభల్లోనూ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ అధికాకంలోకి వచ్చాక మాత్రం ఇచ్చిన హామీ మేరకు వయసు పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిపై నిర్ణయం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినప్పటికీ రెండు నెలలుగా అటు నుంచి ఎలాంటి స్పందనా లేదు.
మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని అక్కడి ప్రభుత్వం 46 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు భరోసా కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం గతేడాది ఇచ్చిన డీఎస్సీ–2025లో అభ్యర్థుల వయోపరిమితిని 44 సంవత్సరాలు చేసింది. కానీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం తప్పించుకుంటోంది. గతేడాది జూలైలో అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా వయో పరిమితి పెంచలేదు.
హామీ విస్మరిస్తే ఊరుకోం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 47 సంవత్సరాలకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని లోకేశ్ ఎందుకు విస్మరిస్తున్నారు? రాష్ట్రంలో యూపీఎస్సీ మాదిరిగా ఏటా నోటిఫికేషన్స్ రావడం లేదు. కొన్ని నోటిఫికేషన్లపై న్యాయ వివాదాలతో ఏళ్ల తరబడి భర్తీ పూర్తి కావడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకోవాలి. వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. లేకపోతే నిరుద్యోగుల ఆందోళన తప్పదు. – ఎంబేటి రామచంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ
ఏటా 75 వేల మందికి అన్యాయం
ఏపీపీఎస్సీ ఓటీపీఆర్‌లో నమోదైన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 75 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. రెండు నెలలుగా వయో పరిమితి పెంపుపై ప్రభుత్వంగానీ, గతంలో హడావుడి చేసిన నారా లోకేశ్‌గానీ స్పష్టతనీయడం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది.
ఇప్పటికే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీని నీరుగార్చిందన్న అపవాదును మూటగట్టుకొంది. దాదాపు 7 నెలలుగా సర్వీస్ కమిషన్‌కు రెగ్యులర్ చైర్మన్‌ను నియమించకుండా ఇన్‌చార్జితోనే నెట్టుకొస్తోంది. దీంతో కమిషన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అభ్యర్థుల వయోపరిమితిపై మాత్రం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం.


