ఏపీపీఎస్సీ కొత్త నిబంధన.. ఆ అభ్యంతరాలకు రూ.100 చెల్లించాలి

APPSC New rule: Rs 100 should be paid objection question, answer keys - Sakshi

పోస్టుల భర్తీలో విపరీత జాప్యం తప్పించేందుకే ఈ నిబంధన

వేలాదిగా తప్పుడు అభ్యంతరాలు వస్తుండటంతో నిర్ణయం

అభ్యంతరం సరైనదని తేలితే ఆ డబ్బులు తిరిగి చెల్లింపు

సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు, వాటి జవాబులపై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలకు ఒక్కో దానికి రూ.100 చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొత్త నిబంధన విధించింది. ఇటీవల విడుదల చేసిన రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు అన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. కమిషన్‌ నిర్వహించే వివిధ పరీక్షల్లో కీలపై వస్తున్న వేలాది అభ్యంతరాల్లో తప్పుడువే అత్యధికంగా ఉంటున్నాయి.

‘కమిషన్‌ నిర్వహించిన రిక్రూట్‌మెంట్‌ పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్టు)ల్లో ఆబ్జెక్టివ్‌ టైప్‌ పేపర్‌లోని ప్రశ్నలు, వాటి సమాధానాల కీలకు వ్యతిరేకంగా అభ్యర్థులు తప్పుడు, అసంబద్ధమైన అభ్యంతరాలను వేలాదిగా దాఖలు చేస్తున్నారు. వీటిని పరిశీలించి పరిష్కరించే క్రమంలో ఫలితాల ప్రకటన సహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో విపరీత జాప్యం జరుగుతోంది.

చదవండి: (ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?)

అందువల్ల కమిషన్‌ నిర్వహించే అన్ని పరీక్షలకు వర్తించేలా ఒక నిబంధన చేర్చాలని కమిషన్‌ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రశ్న పత్రం, జవాబు కీ, ఇతర విషయాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కింద ఈ నిబంధన పెట్టాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇకపై అభ్యర్థి ప్రశ్న, జవాబు కీకి వ్యతిరేకంగా లేవనెత్తే ప్రతి అభ్యంతరానికి రూ.100 చొప్పున నిర్ణీత గడువులోగా చెల్లించాలి. తుది పరిశీలనలో ఈ అభ్యంతరాల్లో నిజమై­న వాటిని దాఖలు చేసిన అభ్యర్ధులకు ఆ మొత్తాన్ని తిరిగి కమి­షన్‌ చెల్లిస్తుంది.’ అని కమిషన్‌ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కొత్త నిబంధనను అదనంగా జోడించిన నోటిఫికేషన్ల నంబర్లు: 08/2021, 16/2022, 09/2021, 17/2022, 10/2021, 18/2022, 14/2021, 14/2022, 15/2021, 15/2022, 23/2021, 24/2021, 6/2022, 11/2022, 12/2022, 19/2022, 20/2022, 21/2022, 25/2022, 28/2022  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top