AP TET 2022: ప్రారంభమైన ఏపీ టెట్‌ పరీక్షలు

AP TET 2022 Exam CBT Starts Today 6th August - Sakshi

ఈ నెల 21 వరకు పరీక్షలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీటెట్‌)–ఆగస్టు 2022 శనివారం (నేటి) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్‌ ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 వరకు కంప్యూటరాధారితంగా ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. రాష్ట్రంతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికేట్‌ చెల్లుబాటు ఇంతకుముందు ఏడేళ్లుగా ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పుచేసి చెల్లుబాటును జీవితకాలంగా ప్రకటించింది. 

వెయిటేజీతో పెరిగిన అభ్యర్థులు
ఇక ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంటు టీచర్‌ పోస్టుల అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుండడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్‌ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం.. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top