ఉప్పొంగుతున్న నదులు

AP: Rising River Due To Heavy Rains The Catchment Areas - Sakshi

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/అచ్చంపేట/తాడేపల్లి రూరల్‌/శ్రీశైలం ప్రాజెక్ట్‌: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు వరదతో పోటెత్తుతున్నాయి. ఎగువన కృష్ణా నదిలో వరద పెరగడంతో ముందు జాగ్రత్తగా ఆల్మట్టి, నారాయణపూర్‌లను ఖాళీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్‌ విద్యుదుత్పత్తిని పెంచేస్తూ దిగువకు 31 వేల క్యూసెక్కులను వదిలేస్తోంది.

దీంతో శ్రీశైలం నీటిమట్టం 849 అడుగుల వద్దే ఉండిపోయింది. 854 అడుగుల స్థాయికి నీటిమట్టం చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అత్యవసరాల కోసం ఆరేడు వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి శనివారం వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మూసీ, కట్టలేరు, వైరా, మున్నేరు ఉప్పొంగడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1.22 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దీంతో 70 గేట్లు ఎత్తి 1.20 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్‌ తెలిపారు.

గోదావరిలోనూ వరద ఉధృతి 
గోదావరిలోనూ వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే వద్దకు రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో నీటిమట్టం 28.7 మీటర్లకు పెరిగింది. వచ్చిన వరదను వచ్చినట్టు 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.09 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 1.64 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి పోలవరం ప్రాజెక్టు వద్దకు పది నుంచి 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ముంపునకు గురయ్యే తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, చింతూరు, వీఆర్‌ పురం, కూనవరం, నెల్లిపాక మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు పునరావాసం కల్పిస్తున్నారు. కాగా, నాగావళి నది నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 2,048 క్యూసెక్కులు వస్తుండగా.. ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,562 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వంశధార నుంచి 1,873 క్యూసెక్కులు గొట్టా బ్యారేజీలోకి చేరుతుండగా.. ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,200 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పెన్నానదిపై ఉన్న సోమశిల ప్రాజెక్టులోకి 8,700 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 52.21 టీఎంసీలకు చేరుకుంది.

 ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద వరద పరిస్థితి ఇలా..   

వచ్చే మూడు రోజులు వర్షాలు బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరంల్లో 7.2 సెం.మీ., పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 7.1 సెం.మీ. వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో 1 నుంచి 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top