అలల సాగరంపై బతుకు విన్యాసం.. కడలి పుత్రుల జీవనం విలక్షణం

Ap Prakasam Singarayakonda Fishermen Life Story - Sakshi

సముద్రమే వీరి జీవనాధారం 

వేటలో ఎన్ని మెళకువలో 

వేట సాగితే పండుగే... 

ఒక్కో వలకు ఒక్కో సైజు కన్ను 

ఐలా, రింగుల, కొనాము వలలతో భారీగా వేట 

మారుతున్న జీవన విధానం   

కడలే వారికి అమ్మ ఒడి. అలల సవ్వడులు వారికి జోలపాట. సాగరంలో వేటే జీవనంగా సాగుతున్న మత్స్యకారుల జీవనశైలి అంతా విభిన్నం. ఇల్లు వదిలి సముద్రంలోకి వెళ్లి.. తిరిగొచ్చే వరకు అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ నిత్యం ఆటుపోటుల మధ్య సాగే వీరి జీవనం ఓ సమరం. గంగమ్మ చెంత మత్స్యకారుల దిన చర్య అర్ధరాత్రి నుంచే ఆరంభమవుతుంది. నడి సంద్రం సాక్షిగా వీరు సాగించే జీవన తెరను ఒక్కసారి తెరిస్తే ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. వీరు వినియోగించే వల దగ్గర నుంచి సాగరంలో సాగించే వేట వరకూ అన్నీ విభిన్నం..విలక్షణమే.. ఇంకెందుకాలస్యం సముద్ర తీరానికి పోదాంపదండి... 

సింగరాయకొండ మండలం పాకల సముద్రతీరం. ఇక్కడ చిన్నా..పెద్దా, ఆడ..మగా అనే తేడా లేకుండా అందరూ వేట పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది తెల్లవారుజామునే వేటకు వెళితే.. మరికొంత మంది రేపటి కోసం వలలను సిద్ధం చేస్తూ కనిపించారు. మరికొందరు పడవలను శుభ్రం చేస్తున్నారు. వేటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగొచ్చిన విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు భోజనాలతో తీరానికి వస్తారు. అక్కడే అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఇక్కడ జీవనం సాగిస్తున్న గంగపుత్రులను పలకరిస్తే వారి బతుకుల్లో విలక్షణత కనిపించింది. కడలిలో వందల కిలోమీటర్లు రోజుల తరబడి వీరు చేస్తున్న సాహసం తెలుస్తుంది. చేపల వేటే జీవనంగా మార్చుకున్న గంగపుత్రులకు వేట విరామ సమయమే విశ్రాంతి. ఎగిసిపడే కెరటాలను అవలీలగా దాటి కడలిని సునాయాసంగా ఈదే మత్స్యకారుల బతుకు ప్రకృతి విపత్తుల మధ్య పెనుసవాలే.. 

అంతా విలక్షణం... 
అందరిదీ ఒక్కటే మాట..బాట. ఒక్క మాటలో చెప్పాలంటే.. పెద్దకాపు తీసుకున్న నిర్ణయమే శాసనం. తప్పొప్పులు జరిగితే.. పరిష్కరించేందుకు వీరు పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కేది ఉండదు. కట్టుబాటును ఎవరూ ధిక్కరించరు. పెద్ద కాపు, నడింకాపు, చిన్నకాపు.. ఇలా ఊరిలో ముగ్గురిని గ్రామ పెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. వీరు చెప్పిందే ఆ ఊరందరికీ వేదం. చేసిన తప్పులకు వీరు వేసే శిక్ష వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఊరంతా అనుసరించాల్సిందే.  

వల..వలకూ ప్రత్యేకమే... 
మత్స్య సంపదను వేటాడటానికి రకరకాల వలలు వినియోగిస్తారు. చేపలు, రొయ్యలు, పీతలు ఒక్కొక్కదానికి ఒక్కో వలను వేటకు వాడతారు. ఏ వల కొనుగోలు చేయాలన్నా రూ.లక్షల్లోనే మరి. వేట సరిగ్గా సాగితే అది పెద్దలెక్కలోదేమీ కాదు. సంప్రదాయ మత్స్యకారులు వాడే వలలు పులసల వల, నరంవల, బాడీవల, సన్నకన్నుల వల, ఐలావల, రింగుల వల, కొనాము వల. వీటిల్లో అత్యంత ఖరీదైంది ‘ఐలా వల’. దీని ఖరీదు దాదాపు రూ.రెండు లక్షలు ఉంటుంది. అంటే ఒక్కో వల అతి తక్కువ పొడవు అంటే ఒక కిలో మీటరు. ఇక పొడవు పెరిగే కొద్దీ ధర పెరుగుతూ ఉంటుంది. దీనితో సముద్రం ఒడ్డున ఉండి మరీ వేట సాగిస్తారు. ఈ వలను సముద్రంలో రెండుమూడు పడవల్లో వేసుకుని ఎంత పొడవు ఉంటే అంత దూరంలో సముద్రంలో వదులుకుంటూ వెళ్తారు. ఒడ్డున ఉండి మత్స్యకారులు ఒక చివర పట్టుకుని ఉంటే.. రెండో చివర మరో పక్కన ఒడ్డునే ఉండి మరికొంతమంది మత్స్యకారులు పట్టుకుంటారు.

సముద్రంలో వదిలిన వలను రెండు అంచులు పట్టుకుని లాగుతారు. ఐలా, రింగుల, కొనాము వలను లాగడానికి దాదాపు 50 మందికిపైగా మత్స్యకారులు కావాలి. కాకినాడ నుంచి ప్రత్యేకంగా మత్స్యకారులను తీసుకొచ్చి వేటకు వెళ్తారు. సుదూర ప్రాంతం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ వలల యజమానికి అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. మత్స్య సంపద పడితే ఊపిరి పీల్చుకుంటాడు. లేకుంటే మళ్లీ రెండో ప్రయత్నమే మరి. పీతలు, చిన్నచేపలు, రొయ్యల కోసం ముందు రోజు లంగరు వేసి తర్వాత రోజు ఉదయాన్నే సముద్రంలోకి వెళ్లి మత్స్యసంపద తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన మత్స్య సంపదను ఊర్లో ఉన్న వ్యాపారులకు ఇస్తారు. వారు సరుకును బట్టి ప్రత్యేక వాహనాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఒడిస్సా పంపిస్తుంటారు.  

పడవలోనే వంటా వార్పూ... 
సుదూర ప్రాంతాలకు వేట కోసం వెళ్లేవారు ముందుగానే పడవలో వంట సరుకులు తీసుకువెళ్తారు. అందులోనే వంటా వార్పూ. తమ వెంట తీసుకెళ్లిన పప్పులు, కూరగాయలతోనే కాకుండా సముద్రంలో లభించే చేపలు, రొయ్యలను సైతం వండుకుని తింటారు. అంతేకాదు వీరికి ప్రత్యేక భాష ఉంటుంది. తమిళం కలిపి వీరు మాట్లాడుతుంటారు.  

ఎంతో మార్పు... 
రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మత్స్యకారుల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. వేట విరామ సమయంలో గత ప్రభుత్వాలు అరకొరగా.. అదీ ఏడాదికి రూ.4 వేలు ఆర్థిక సాయం, 20 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునేవి. ప్రస్తుతం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. వేట బోట్లకు డీజిల్‌ సబ్సిడీని గణనీయంగా పెంచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.10 లక్షల పరిహారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా రూ.3.30 లక్షల విలువైన బోటు, మోటార్లు, వలలు రాయితీపై అందిస్తోంది. మెకనైజ్డ్‌ బోట్ల పంపిణీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న అమ్మఒడితో పిల్లలు చదువుకు వెళ్తున్నారు.  

విరామ సమయంలో... 
వేట విరామ సమయంలో కూడా మత్స్యకారులు అందుబాటులో ఉన్న ఆక్వా కల్చర్‌కు, వ్యవసాయ, ఉపాధి పనుల్లో కూలీలుగా వెళ్తారు. మరికొందరు రొయ్యల చెరువుల్లో రొయ్యలు పట్టడం, ప్యాకింగ్‌ చేయడం, ఇతరత్రా పనులకు వెళ్తారు. ఆయా పనులు దొరకని పక్షంలో ఆటలతో కాలక్షేపం చేస్తుంటారు. 

చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ 
ఉదయం ఆరు గంటలకు చేపల వేటకు బోటులో ఇద్దరం వెళ్లాం. ప్రస్తుతం పీతలు మాత్రమే పడ్డాయి. పీతలు పెద్దసైజు అయితే కేజీ రూ.150 ఉండగా, చిన్న సైజు కేజీ రూ.60 మాత్రమే. పీతలు పడితే చాకిరీ ఎక్కువ.. ఆదాయం తక్కువ. 
– అల్లారి లక్ష్మణ్, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల 

శాపంగా తమిళనాడు బోట్లు... 
చేపల వేట ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. సముద్రంలో చాలా దూరం వెళ్లి వలలు వేస్తేనే చేపలు లభిస్తున్నాయి. ఈలోగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కడలూరు జాలర్లు సోనా బోట్లతో నిబంధనలు అతిక్రమించి తీరానికి సమీపంలో చేపల వేట చేయడంతో లక్షలాది రూపాయల విలువ గల వలలు ధ్వంసమై తీవ్రంగా నష్టపోతున్నాం. చెన్నై బోట్లు తీరంలో వేటాడకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. 
– ప్రళయ కావేరి రోశయ్య, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల 

రోజూ రూ.200 సంపాదన 
ఇంటింటికి తిరిగి చేపలు అమ్ముకుంటూ జీవిస్తాను. చేపల వేట సాగించి తీరానికి వచ్చిన బోట్ల మత్స్యకారులకు బఠానీలు వంటి తినుబండారాలు ఇచ్చి వారి వద్ద నుంచి చేపలు తీసుకెళ్లి అమ్ముకుంటాను. రోజుకు 150 నుంచి 200 రూపాయలు సంపాదిస్తాను. నాకు వృద్ధాప్య పింఛన్‌ రూ.2,750 వస్తుంది. 
– వాటిపల్లి పోలేరమ్మ, పోతయ్యగారిపట్టపుపాలెం, పాకల 
చదవండి: ఇది ఖైదీల బంక్‌..! రోజుకు రూ.5 లక్షల అమ్మకాలు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top