విషం పీల్చుతూ.. తాగుతూ..

Ap Pollution Control Board Given Time Two Weeks To Amara Raja Batteries - Sakshi

 అమరరాజా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజల దుస్థితి ఇది 

 సీసం గాఢత తీవ్రంగా ఉంది.. 

అక్కడ చెరువులు కాలుష్య కాసారాలే తేల్చి చెప్పిన పొల్యూషన్‌ బోర్డ్‌ 

టీడీపీ హయాంలో పట్టించుకోని అధికారులు 

సాక్షి ప్రతినిధి, తిరుపతి: రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న అమరరాజా పవర్‌ సిస్టం లిమిటెడ్, అమరరాజా బ్యాటరీస్‌ ఇండస్ట్రీస్, మంగళ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌లు అక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆయా కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం ధాటికి చుట్టుపక్కల గ్రామాలు బలిపీఠంపై ఉన్నాయి. వాస్తవానికి ఆ ఫ్యాక్టరీలు శుద్ధి చేసిన నీటిని వాడాలి. కానీ అమరరాజా ఫ్యాక్టరీస్‌ శుద్ధి చేసిన నీటిని కాకుండా పలుమార్లు ప్రాసెస్‌ చేసిన నీటిని అక్కడే మొక్కలకు వదిలేస్తున్నారు. వాస్తవానికి ఆ నీటిని దూరంగా సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలేయాలి. కానీ అక్కడే వదిలేయడంతో అవి ఇంకిపోయి మొత్తం భూగర్భజలాలన్నీ పాడవుతున్నాయి. 

ఇక ఆయా ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢత తీవ్రంగా ఉంది. ఏ స్థాయిలో ఉందంటే కార్మికులు వేసుకునే దుస్తులపైనే కాదు.. కార్మికుల రక్తంలోనూ ఉంది. 20 శాతం ఉద్యోగుల రక్తంలో సీసం శాతం ఆందోళనకర స్థాయిలో ఉందని పరీక్షల్లో తేలింది.  నిబంధనల ప్రకారం ఆయా ఫ్యాక్టరీల్లో పనికి వెళ్లే కార్మికులు ప్రత్యేక యూనిఫాం ధరించాలి. విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందు ఆ యూనిఫాం తీసివేసి,.. వేరే దుస్తులు వేసుకోవాలి.

కానీ సదరు ఫ్యాక్టరీల యాజమాన్యం ఎక్కడా ఇలాంటి ఏర్పాటు చేయలేదు... ఫలితంగా కార్మికుల ప్రాణాలకు అక్కడ భద్రత లేకుండా ఉంది.’’ అని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు ఆందోళన వక్తం చేస్తున్నారు.. ‘అమరరాజా లెడ్‌తో అంతులేని వ్యధ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పీసీబీ అధికారులు స్పందిస్తూ... నిజంగానే అక్కడి పరిస్థితి అదుపుతప్పుతోంది.. కానీ యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదు.. అని వ్యాఖ్యానించారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే సీసం గాఢతకు చుట్టుపక్కల ఉన్న నాలుగు చెరువులూ కాలుష్యకాసారంలా మారాయని చెప్పుకొచ్చారు. 

టీడీపీ హయాంలో పీసీబీ తనిఖీలే లేవట 
గత టీడీపీ ఐదేళ్ల హయాంలో గానీ, అంతకుముందు నాలుగేళ్లలో గానీ మొత్తంగా తొమ్మిదేళ్ల కాలంలో అమరరాజా ఫ్యాక్టరీస్‌లో ఏనాడూ పీసీబీ తనిఖీలు చేసిన దాఖలాలే లేవని స్వయంగా సదరు అధికారులే చెప్పుకొస్తున్నారు. అప్పట్లో ఎప్పుడైనా మొక్కుబడిగా పీసీబీ అధికారులు వెళ్లి రావడం తప్పించి తనిఖీలు, దాడులు, విచారణల ప్రసక్తే లేదని గుర్తు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పలుమార్లు తనిఖీలు చేయడం వల్లనే వాస్తవాలు బయటికొచ్చాయని చెప్పుకొచ్చారు. అక్కడ కాలుష్య నివారణ ప్రమాణాలు కనీసంగా పాటించడం లేదని తేలిందన్నారు. 

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే వరకూ అక్కడ రోడ్లు కూడా లేవు 
వాస్తవానికి ఎక్కడ ఫ్యాక్టరీలు నెలకొల్పినా.. ఆయా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి సదరు ఫ్యాక్టరీల యాజమాన్యాలు కృషి చేస్తుంటాయి. ఇక ఫ్యాక్టరీల కాలుష్యపు దుష్ప్రభావంతో కునారిల్లే గ్రామాలకు ఇంకెంత ఖర్చు చేస్తారో చెప్పనక్కర లేదు. కానీ ఇక్కడ అమరరాజా ఫ్యాక్టరీ .. గేటు పక్కనే ఉన్న తారకరామానగర్‌ గ్రామం గురించే కనీసంగా పట్టించుకోలేదు. పైగా ఓ దశలో ఆ ఊరి ప్రజలను తమ ఫ్యాక్టరీ మీదుగా నడవొద్దని హుకుం జారీచేశారు. దీన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో ఎట్టకేలకు దారి ఇచ్చారు. ఆ ఊరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సిమెంట్‌ రోడ్డు లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్‌సీపీ పాలన వచ్చిన తర్వాతే మా గ్రామంలోకి సిమెంట్‌ రోడ్లు వచ్చాయని స్థానికంగా నివసిస్తున్న ఫొటోగ్రాఫర్‌ శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.

రెండు వారాల్లో ఏం చేస్తారో చూడాలి  
‘అమరరాజా ఫ్యాక్టరీల కాలుష్యం, అందులోని లెడ్‌ శాతంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కాలుష్య నివారణ చర్యలకు ఉన్నత న్యాయస్థానం రెండు వారాల గడువిచ్చింది. ఈ లోగా సదరు యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి...’ అని పీసీబీ జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ కె.వెంకటేశ్వరరావు శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఈ లోగా తమ పీసీబీ తరఫున ఓ కమిటీ అక్కడ పరిస్థితులపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేస్తుందన్నారు.
– పీసీబీ జేసీఈఈ వెంకటేశ్వరరావు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top