40 ఇయర్స్‌ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్‌ రియల్‌ సీఎం | Sakshi
Sakshi News home page

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ భ్రమరావతి వర్సెస్‌ రియల్‌ సీఎం

Published Sat, Mar 2 2024 3:47 PM

40 years fake statements by babu vs realistic approach by CM Jagan - Sakshi

కొట్టొచ్చినట్టు కనిపిస్తోన్న తేడా

చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో అంతా భ్రమరావతి కథలే

ఐదేళ్లలో నిజమైన అభివృద్ధి, సంక్షేమ పాలనను చూపించిన జగన్‌

ఏపీలో చిట్టచివరి నియోజకవర్గం, ఒక మూలకు విసిరేసినట్లు ఉండే కుప్పానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను చెప్పినట్లే తాగునీరు, సాగునీరు విడుదల చేశారు. ఇందుకు అవసరమైన కాల్వలను తవ్వించి, ఇతర ఏర్పాట్లు చేసి హంద్రీనీవా సుజల స్రవంతిలో  భాగంగా నీటిని కుప్పం వరకు తీసుకువెళ్లగలిగారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, ముప్పైఐదేళ్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేని పనిని  జగన్ చేసి చూపించారు. తద్వారా ఈ ప్రజల దాహార్తిని తీర్చే యత్నం చేశారు. అలాగే ఆరువేల ఎకరాలకు సాగు నీరు కూడా ఇవ్వడానికి సంకల్పించారు. ఇందుకోసం సుమారు అరు వందల కోట్ల రూపాయలను వ్యయం చేశారు.

కుప్పంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ "ఇంతకాలం చంద్రబాబును ఈ నియోజకవర్గ ప్రజలు భరించినందుకు జోహార్లు" అని వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఈ సభలో చంద్రబాబు టైమ్‌లో కుప్పంకు జరిగిన పనులు, తన హయాంలో జరిగిన కార్యక్రమాలను వివరించారు. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గ ప్రజలకు వివిధ స్కీముల ద్వారా 1400 కోట్ల మేర లబ్ది జరిగిన విషయాలను లెక్కలతో సహా వివరించారు. తాను ప్రాంతం, కులం, మతం, పార్టీ చూడకుండా, ఎలాంటి వివక్ష లేకుండా స్కీములు అమలు చేశానని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు తనపై కోపం వచ్చినప్పుడల్లా, పులివెందుల , కడప, రాయలసీమ ప్రజలను దూషిస్తుంటారని, తాను మాత్రం ఎప్పుడు అలా చేయలేదని ప్రజల మనసులను ఆకట్టుకునే యత్నం చేశారు.ఇంతవరకు ఒప్పుకోవలసిందే.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని వద్ద కాపు ఉద్యమకారులు రైలును దగ్దం చేస్తే, ఆ పని చేసింది కడప రౌడీలంటూ మీడియా సమావేశం పెట్టి ఆరోపించారు. కాని పోలీసులు అన్నిటిని విచారించి  ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారిని అరెస్టు చేశారు. అలాగే ఆయన  తనకు ఓటు వేయని వారికి తాను ఎందుకు సదుపాయాలు కల్పించాలని అనేవారు. తనకు ఓటు వేయకపోతే  తాను వేసిన రోడ్డు, తాను మంజూరు చేసిన మరుగు దొడ్డి ఎలా వాడతారని చంద్రబాబు ప్రజలను ప్రశ్నించేవారు. కానీ జగన్ అందుకు విరుద్దంగా తనకు ఓటు వేసినా, వేయకపోయినా, తన ప్రభుత్వ స్కీములు ప్రాంతం, కులం, పార్టీ,మతం వంటివాటితో సంబంధం లేకుండా అమలు చేస్తున్నారు.

కుప్పం ప్రజలు సైతం అందులో భాగమేనని, అందుకే మాట ఇచ్చిన ప్రకారం నీరు అందించానని, వివిధ అబివృద్ది పనులు చేపట్టానని సీఎం జగన్‌ చెప్పారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుప్పంలోని గ్రామీణ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా భారీ ఎత్తున జనం రావడం, వారు ఆయా సమయాలలో అనుకూల నినాదాలతో  హోరెత్తించడం కనిపించింది. దీంతో టిడిపి అధినేత కుప్పంలో తన పోటీపై గట్టిగా ఆలోచించుకునే  పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. కుప్పం ప్రజలు చంద్రబాబును ఇంతకాలం భరించినందుకు వారికి జోహార్లు అని జగన్ చమత్కరించారు. కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఆయన హామీ ఇవ్వడం ద్వారా కుప్పం ప్రాముఖ్యత తగ్గదని ప్రజలకు ఆయన సంకేతం ఇచ్చారు.

గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలలో YSRCP విజయఢంకా మోగించడం, కుప్పానికి నీరు, బలహీనవర్గాలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు, కుప్పం మున్సిపాలిటీగా మారడం, రెవెన్యూ డివిజన్ ఇవ్వడం వంటివి పార్టీకి ప్లస్ అవుతాయి. జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న పట్టుదలతో పనులు చేశారు. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికైతే చంద్రబాబు గతంలో మాదిరి నల్లేరు మీద బండి మాదిరి ఎన్నిక చేసుకోలేకపోవచ్చని, తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పదన్న విశ్లేషణలు వస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు తన టైమ్ లో కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పూర్తి చేయలేకపోవడం పెద్ద వైఫల్యంగా చెప్పాలి. హంద్రీ-నీవా ప్రాజెక్టు ప్రతిపాదన ఎన్.టి.ఆర్.టైమ్ లో వచ్చినా,దానిని ఆచరణ లో పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు చివరిలో ఉన్న కుప్పంకు సైతం నీరు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిది. కుప్పం ప్రాంతానికి శాశ్వతంగా నీటి సమస్య తీర్చడానికి వీలుగా రెండు రిజర్వాయర్లను నిర్మించడానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ రకంగా కుప్పం ప్రజల అభిమానం పొందడానికి జగన్ యత్నించారు. కాగా చంద్రబాబు మాత్రం పులివెందుల ప్రజలను తరచుగా అవమానించేవారు.

కుప్పంకు నీరు ఇవ్వడంపై చంద్రబాబు స్పందించిన తీరు కూడా సరిగా లేదు. నిజానికి ఆయన హర్షం వ్యక్తం చేసి ఉంటే హుందాగా ఉండేది. ఆ పని చేయకపోగా, కుప్పం ప్రజలను దోచుకున్నారంటూ, ఏదో హింస జరిగిందంటూ పిచ్చి ఆరోపణలను చంద్రబాబు చేసి తన విలువను మరింత తగ్గించుకున్నారు. పులివెందులలో పొలాలు ఎండిపోతున్నాయని అంటూ ఏవేవో మాట్లాడారు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులకు అదికంగా ఖర్చు చేసింది తానేనని ఆయన ప్రకటించుకున్నారు. పదమూడు శాతం పనులు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి మిగిలాయని, కాని జగన్ మొత్తం తానే చేసేసినట్లు చెప్పుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంతే తప్ప తాను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం కు ఎందుకు నీళ్లు తేలకపోయింది మాత్రం చెప్పలేకపోయారు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కాకపోతే బుకాయింపులో దిట్ట కనుక యధాప్రకారం డబాయిస్తూ ప్రకటన చేశారు. దానిని ఈనాడు,ఆంధ్రజ్యోతి బాకా మీడియాలు ప్రచారం చేశాయి. ఈనాడు అయితే కుప్పంను తానే ఉద్దరించినట్లు జగన్ మాట్లాడడం విని స్థానికులు విస్మయం చెందుతున్నారని  ఒక దిక్కుమాలిన కధనాన్ని ఇచ్చింది.

కుప్పంకు 35 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ పట్టణాన్ని ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు? ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు? ఎందుకు 15వేలమందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అసలు కుప్పంలో కొన్ని వార్డులకు వెళ్లడానికి సరైన రోడ్లే ఎందుకు లేవు? రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కుప్పం కన్నా పులివెందుల ఎంత చక్కగా ఉంటుందో స్వయంగా ఎవరైనా వెళ్లి చూడవచ్చు. పులివెందుల చుట్టూ రోడ్డు, పరిశ్రమలు, పలు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీ మొదలైనవి ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి కాదా? కుప్పంకు ఎయిర్ పోర్టు ఇస్తానని పిచ్చి ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో ఒక పరిశ్రమనైనా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? వీటన్నిటిని కప్పిపుచ్చుతూ, జగన్ కుప్పం కు నీళ్లు ఇవ్వడాన్ని చూసి ఓర్వలేక ఈనాడు ఇలాంటి దద్దమ్మ వార్తలు ఇస్తోంది.

చంద్రబాబు ఇంతకాలం దొంగ ఓట్లపై ఆధారపడి ఎక్కువ మెజార్టీ పొందగలిగారన్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఆ దొంగ ఓట్లను చాలావరకు తొలగించినట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆయన తీవ్రమైన పోటీని ఎదుర్కునే పరిస్థితి ఏర్పడింది. అందుకే చంద్రబాబు ఎక్కువగా కంగారు పడుతున్నారు. దానికి తోడు జగన్ కుప్పంపై దృష్టి పెట్టి అభివృద్ది పనులు, సంక్షేమ స్కీములు అమలు చేశారు. కుప్పంకు నీరు కూడా వచ్చేలా చేశారు. ఇది YSRCPకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టిడిపి మీడియాలు నీరు విడుదల చేసిన మరుసటి రోజు కాల్వలో నీరు లేదంటూ ఒక తప్పుడు కదనాన్ని వండి జనాన్ని ఏమార్చడానికి యత్నించారు. ఇంకా నీళ్లురాని కాల్వలో దిగి టిడిపి నేతలు యాగీ చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడుతున్నదీ తెలుసుకోవచ్చు. గెలుపు ఓటములు సంగతి ఎలా ఉన్నా, జగన్ మాత్రం కచ్చితంగా తన రాజకీయ ప్రత్యర్ధి అని కూడా చూడకుండా, తన పార్టీకి ఓటు వేశారా? లేదా? అన్నదానితో నిమిత్తం లేకుండా  కుప్పం ప్రజలకు కూడా మేలు చేశారన్నది నిజం. అందుకు ఎవరైనా అభినందించాల్సిందే.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్టు

Advertisement
Advertisement