
యువ వైద్యులపై మరోసారి పోలీసులు జులుం
పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులతో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎదుట ధర్నా చేస్తున్న వారిపై మరోసారి పోలీసులను ఉసిగొల్పింది. దీంతో యువ వైద్యులను పోలీసులు కాళ్లతో తొక్కేసి.. జట్టు పట్టుకొని ఈడ్చేశారు. నేరతుల కంటే దారుణంగా.. వారిని బలవంతంగా ట్రక్కుల్లోకి ఎత్తిపడేశారు. వారికి అండగా నిలిచిన విద్యార్థి సంఘాల నాయకులను సైతం అరెస్ట్ చేసి రాత్రి వరకు నిర్భందించారు.
మూకుమ్మడిగా మీద పడి లాక్కెళ్లారు..
విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వందలాది మంది యువ వైద్యులు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రులను సైతం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో నాలుగు రోజులుగా విజయవాడలో ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఉన్న హెల్త్ యూనివర్సిటీ ఎదుట నిరసన తెలుపుతున్నారు. గురువారం కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారికి వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌కుమార్, కార్యదర్శి ఐ.రాజేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి తదితరులు మద్దతు తెలిపారు.
ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డి.శ్రీహరిరావు కారును అడ్డుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంతలో సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకాష్ తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు హెల్త్ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. మూకుమ్మడిగా వైద్య విద్యార్థులపై పడి.. వారిని ఈడ్చేశారు. మహిళా వైద్యులని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్లి ట్రక్కుల్లో పడేశారు.
దీంతో పలువురు గాయపడ్డారు. అనంతరం వారిని ఎంజీ రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్‌కు తరలించారు. పోలీస్ లు తమ పట్ల కర్కశంగా వ్యవహరించారని యువ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చేయలేకపోతే.. చంపేయండి అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
యువ వైద్యుల జీవితాలతో సర్కార్ చెలగాటం..
వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ యువ వైద్యులను పరామర్శించారు. వారి సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. యువ వైద్యుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.