
వచ్చేనెల 12 నుంచి 20 వరకు పరీక్షలు
విద్యార్థులు తేరుకోకుండానే సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మిడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చేనెల 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటలకు మొదటి ఏడాదికి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ప్రాక్టికల్స్ మే 28 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు.
22 వరకు రీకౌంటింగ్ ఫీజు చెల్లింపు
ఇంటర్ జవాబు పత్రాల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు బోర్డు అవకాశం కల్పించింది. అభ్యర్థులు నేటి నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌కు రూ.1,300, రీ కౌంటింగ్‌కు రూ.260 ఫీజుగా పేర్కొన్నారు.

సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు
సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. పేపర్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా మొదటి లేదా రెండో ఏడాదికి రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సుకు రూ.165, బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్స్‌కు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు రూ.1,200, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.550, రెండేళ్ల బ్రిడ్జి కోర్సుకు రూ.330 చెల్లించాలి.
ఇంప్రూవ్‌మెంట్‌కు...
ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే విద్యార్థులు రూ.600 ఫీజుతో పాటు ప్రతి పేపర్‌కు అదనంగా రూ.160 చెల్లించాలి. మార్కుల పెంపునకు (బెటర్‌మెంట్) రెండేళ్లకు కలిపి ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350, సైన్స్ విద్యార్థులు రూ.1,600 చెల్లించాల్సి ఉంటుంది.
చదువుకునే సమయం ఏది?
ఈ ఏడాది పరీక్షలు ముగిసిన 10 రోజుల్లోనే విద్యా సంవత్సరం ప్రారంభించి తరగతులు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అదే పంధాను అనుసరిస్తోంది. విద్యార్థులు పూర్తిగా తేరుకోకుండానే సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. సాధారణంగా ఈ పరీక్షలు మే చివరి వారంలో ప్రారంభమై జూన్ మొదటి వారంలో పూర్తి కావాల్సి ఉండగా, ఈసారి మే రెండో వారానికి మార్చారు. దీంతో విద్యార్థులు చదువుకునేందుకు సరైన సమయం లేకపోవడం గమనార్హం.