అధికారుల నిర్లక్ష్యంతోనే వనరుల దోపిడీ

AP High court says Exploitation of resources due to negligence of officials - Sakshi

చర్యలు లేకపోవడంవల్లే అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది

కాలువనే కప్పేసి దానిపై రోడ్డు వేశారంటే చర్యలెలా ఉన్నాయో అర్థమవుతోంది

ఇలాంటి ఘటనలు రాత్రికి రాత్రే జరగవు.. 

మేం మాత్రం మౌనంగా చూస్తూ ఉండబోం

పరిటాల గ్రామంలో అక్రమ మైనింగ్‌పై తేల్చిచెప్పిన హైకోర్టు

కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసం వ్యాజ్యంతో దీనినీ జత చేయండి

రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం.. ప్రభుత్వాధికారులకు, మైనింగ్‌దారులకు నోటీసులు

సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంవల్లే ప్రకృతి వనరుల దోపిడి యథేచ్ఛగా సాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూస్తూ ఉండటంవల్లే అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండాపోతోందని తెలిపింది. ప్రధాన కాలువను మూసేసి దానిపై ఏకంగా రోడ్డే వేసేశారంటే అధికారుల చర్యలు ఎంత కఠినంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు రాత్రికి రాత్రే జరగవని తెలిపింది. వీటిపట్ల తాము మౌనంగా ఉండబోమని.. వేగవంతమైన చర్యలు ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది.

కృష్ణాజిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన ఈ వ్యాజ్యాన్ని, కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)తో జతచేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పలువురు ప్రభుత్వాధికారులకు, మైనింగ్‌ చేస్తున్న ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 

పరిటాల గ్రామ పరిధిలో ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమ మైనింగ్‌ చేస్తున్నా, భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించి కొండలను పిండి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పరిటాల గ్రామానికి చెందిన మాగంటి ధర్మారావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అనంత వెంకట దుర్గారావు వాదనలు వినిపిస్తూ.. పరిటాలలో జరుగుతున్న మైనింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను ప్రభుత్వమే తెలియజేసిందని చెప్పారు.

ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. అధికారుల నిర్లక్ష్యంవల్లే యథేచ్ఛగా ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో తాము తగిన విధంగా స్పందిస్తామని స్పష్టంచేసింది. ఏకంగా ప్రధాన కాలువనే మూసివేశారని, ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొండపల్లి అటవీ ప్రాంతం ధ్వంసంపై దాఖలైన వ్యాజ్యం సెప్టెంబర్‌ 6న విచారణకు రానున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని కూడా ఆ వ్యాజ్యంతో జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. రెండింటిని కలిపి ఆ రోజు విచారిస్తామంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top