
సాక్షి, అమరావతి: విశాఖపట్నం కాపులుప్పాడలో ప్రభుత్వం తలపెట్టిన అతిథి గృహం నిర్మాణం కోసం 30 ఎకరాల భూమిని బదలాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
భూమి బదలాయింపును సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు గతేడాది పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు అనుమతించిందన్నారు. గ్రేహౌండ్స్ యూనిట్ ఏర్పాటునకు కేంద్రం ఎంత మేర నిధులు కేటాయించిందో తెలియచేస్తూ కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిరి్మస్తోందని, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.