పీఆర్సీ వ్యాజ్యం మళ్లీ మొదటికి.. | Sakshi
Sakshi News home page

పీఆర్సీ వ్యాజ్యం మళ్లీ మొదటికి..

Published Fri, Jan 28 2022 4:59 PM

AP High Court Hearing On PRC Issue, Advocate General Sriram Arguments - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వోద్యోగుల కొత్త వేతన సవరణపై దాఖలైన వ్యాజ్యం విషయంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మరోసారి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. ఈ వ్యాజ్యాన్ని ఎవరికి కేటాయించాలన్న దాని పై సీజే తీసుకునే పరిపాలనాపరమైన నిర్ణయాన్ని బట్టి ఈ కేసు విచారణ ఆధారపడి ఉంటుంది. కొత్త వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్‌ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రోస్టర్‌ ప్రకారం తాము విచారించలేమని జస్టిస్‌ అమానుల్లా ధర్మాసనం రెండ్రోజుల క్రితం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాజ్యాన్ని ఎవరికి కేటాయించాలన్న దానిపై సీజే పరిపాలనా పరమైన నిర్ణయం తీసుకుని, దాన్ని సింగిల్‌ జడ్జి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తికి కేటాయించారు.

దీంతో ఆ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ముందు విచారణకు వచ్చిం ది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం లో పిటిషనర్‌ రాజ్యాంగంలోని అధికరణ 309 కింద ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనలను సవాలు చేశారని తెలిపారు. హైకోర్టు రిట్‌ రూల్స్‌ ప్రకారం.. దీనిని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనమే విచా రించాల్సి ఉందంటూ సంబంధిత రూల్‌ను చదివి వినిపించారు. అధికరణ 309 కింద ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలపై దాఖలయ్యే వ్యాజ్యా లను సాధారణంగా మొదటి కోర్టు ముందే విచారణకు వస్తాయని శ్రీరామ్‌ వివరించారు.

దీనిపై న్యాయమూర్తి పిటిషనర్‌ న్యాయవాది రవితేజ స్పందన కోరారు. ఇది ఓ ఉద్యోగి స్వతంత్రంగా వేసిన సర్వీ సు పిటిషన్‌ మాత్రమేనని రవితేజ తెలిపారు. తాని చ్చిన వినతులను పరిగణ నలోకి తీసుకోకుండా వేతన సవరణ చేయడంవల్ల తనకు అన్యాయం జరి గిందంటూ వ్యక్తిగతంగా పిటిషన్‌ వేశారని ఆయన వివరించారు. మీ వ్యాజ్యంలో మీ అభ్యర్థన ఏమిట ని రవితేజను న్యాయమూర్తి ప్రశ్నించారు. అభ్యర్థన ను స్వయంగా చదివిన న్యాయమూర్తి, ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకే వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యాజ్యం ఎవరికి కేటాయించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ వ్యాజ్యం తాలుకు ఫైళ్లను సీజే ముందుంచాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.

ఆ రెండు తీర్పులనూ పరిగణనలోకి తీసుకోండి..
ఇక గత విచారణ సమయంలో జస్టిస్‌ అమానుల్లా ధర్మాసనం ఉద్యోగుల జీతం ఏ విధంగా తగ్గుతుందో వివరించాలని పలుమార్లు అడిగిన నేపథ్యంలో, పిటిషనర్‌ కేవీ కృష్ణయ్య ఆ వివరాలతో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. 2015 పీఆర్‌సీ ఆధారంగా తనకు ఎంత జీతం వస్తోంది, 2022 పీఆర్‌సీ ఆధారంగా ఎంత వస్తుందో ఆయన వివరించారు. అలాగే, 2015 డీఏ ఆధారంగా వచ్చే జీతం, 2022 డీఏ ఆధారంగా వచ్చే జీతం వివరాలను కూడా ఆయన పొందుపరిచారు. మొత్తం మీద తనకు 2022 పీఆర్‌సీవల్ల రూ.6,072 మేర తగ్గుదల ఉందన్నారు.

ఈ అనుబంధ పిటిషన్‌తో పాటు ఆయన రాష్ట్ర విభజన సందర్భంగా జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రహస్య నివేదికను బహిర్గతం చేయాలంటూ 2011లో అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి ఇచ్చిన తీర్పును జతచేశారు. ఈ తీర్పు ఆధారంగా పీఆర్‌సీ విషయంలో అశుతోష్‌ మిశ్రా సిఫారసుల నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. అంతేకాక.. కోవిడ్‌వల్ల ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లలో 50 శాతం వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ జీతాలు, పెన్షన్లను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలంటూ న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి 2020లో ఇచ్చిన తీర్పునూ జతచేశారు. తన వ్యాజ్యాన్ని తేల్చేటప్పుడు ఈ రెండు తీర్పులనూ పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణయ్య తన పిటిషన్‌లో కోర్టును కోరారు. 

Advertisement
Advertisement