ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లు..: హైకోర్టు | AP High Court Fires On IAS officers | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌లు..: హైకోర్టు

Apr 24 2026 5:04 AM | Updated on Apr 24 2026 5:04 AM

AP High Court Fires On IAS officers

చట్టం, కోర్టులంటే వారికి లెక్కే లేదు: హైకోర్టు

వారి చర్యలపై ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా స్పందించడం లేదు 

సీసీఎస్‌టీ బాబు అహ్మద్‌పై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిటిషన్‌పై హైకోర్టు విచారణ 

ఇలాంటి వారి విషయంలో ఉదాసీనంగా ఉండలేమన్న జస్టిస్‌ బట్టు దేవానంద్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని హైకోర్టు మండిపడింది. ఐఏఎస్‌ అధికారులు వేధిస్తున్నా, ఖజానాకు నష్టం చేకూరుస్తున్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. ఐఏఎస్‌ అధికారులకు చట్టం అన్నా, కోర్టు ఆదేశాలన్నా కనీస స్థాయిలో కూడా గౌరవం లేదంది.  రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు ఓ చోట, వీరు మరో చోట జీవితాన్ని వెళ్లదీస్తున్నారని తెలిపింది. అయితే ఐఏఎస్‌ అధికారులు మాత్రం శుక్ర, శనివారాల్లో విమానాల్లో హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యా­నించింది. ఆయా అంశాలపై  రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో  కోర్టు చూస్తూనే ఉందని వ్యాఖ్యానించింది. 

చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్సెస్‌ (సీసీఎస్‌టీ) బాబు అహ్మద్‌ తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని, పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం మరోసారి విచారణ జరిపారు.  ‘ఇలాంటి అధికారుల విషయంలో మెతక, ఉదాసీన వైఖరిని అవలంభించలేం. బాబు అహ్మద్‌ ప్రజలకు ఉచిత సేవ చేయడం లేదు. ఆయన ప్రతీ నెలా 1వ తేదీన ఠంచనుగా జీతం తీసుకుంటున్నారు. మాకే అధికారం ఉంటే తక్షణమే ఆయనను సస్పెండ్‌ చేసేవాళ్లం. అహ్మద్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, ఆధారాలుంటే ఆయనను సర్వీసు నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తాం’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.   

పదోన్నతుల ఫైళ్లను తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా?  
తొలుత విచారణ పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ బాబు అహ్మద్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  అహ్మద్‌ తరఫు న్యాయవాది వీవీ సతీష్‌  వాదనలు వినిపిస్తూ  పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు. పదోన్నతుల విషయంలో ప్యానల్‌ ఇయర్‌ ముగియడంతో తిరిగి డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ)  నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఎప్పుడో డీపీసీ పూర్తయితే ప్యానల్‌ ఇయర్‌ ముగిసేంత వరకు ఎందుకు పదోన్నతులు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

ఇందుకుగాను అహ్మద్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)నిసూటిగా ప్రశ్నించారు.  పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లను ఐఏఎస్‌ అధికారులు తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? అని ప్రశ్నించారు.  ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపిస్తేనే అన్నీ సర్దుకుంటాయన్నారు.  గతంలో ఓ కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు ధర్మాసనం ఇదే అహ్మద్‌ను భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిందని గుర్తు చేశారు. పదోన్నతుల విషయంలో గత డిసెంబర్‌లో ఈ కోర్టు ఆదేశాలిస్తే ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement