వేసవికల్లా మరో 1,600 మెగావాట్లు రెడీ

AP Govt Support For Two New Thermal Power Plants - Sakshi

రెండు కొత్త థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు రాష్ట్ర సర్కారు దన్ను

రూ.2 వేల కోట్ల రుణానికి గ్యారెంటీ

మార్చి చివరినాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం   

సాక్షి, అమరావతి: వచ్చే వేసవికల్లా మరో 1,600 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం (ఒక్కొక్కటీ 800 మెగావాట్లు)లోని కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు మార్చి ఆఖరు నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ఏపీ జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రస్తుతం 5 వేల మెగావాట్లున్న జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి 6,500 మెగావాట్లకు చేరుతుంది. థర్మల్‌ ప్లాంట్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా ప్రతి చోటా కర్బన ఉద్గారాలు తగ్గించే (ప్యూయెల్‌ గ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌) ప్లాంట్ల ఏర్పాటును కేంద్ర పర్యావరణ శాఖ తప్పనిసరి చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్టు నిబంధనలను న్యాయ సమీక్షకు పంపామని, అనుమతి రాగానే మరో వారం రోజుల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామని జెన్‌కో ఎండీ శ్రీధర్‌ తెలిపారు ఎఫ్‌జీడీ పనులు జరుగుతుండగానే థర్మల్‌ ప్లాంట్ల వాణిజ్య కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పారు.

ఆ ఐదేళ్లూ నత్తనడకే
► కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో, అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటును 2015లో ప్రారంభించారు. ఇవి 2018 నాటికే పూర్తవ్వాలి. కానీ అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇచ్చింది. మరోవైపు కాంట్రాక్టు సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. పనులు ముందుకు సాగకపోవడంతో ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైంది. దీనివల్ల మరోవైపు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగింది. 

స్పీడ్‌ పెంచిన జగన్‌ సర్కార్‌
► ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జెన్‌కోకు స్థాయికి మించిన అప్పులున్నాయి. దీంతో కొత్తగా అప్పులు అందే పరిస్థితి లేకుండా పోయింది. కానీ పనుల్లో మరింత జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. విద్యుత్‌ ధర కూడా ఎక్కువయ్యే వీలుంది. ధర ఎక్కువ ఉంటే తరచూ ఉత్పత్తిని ఆపేసి, తక్కువ ధర విద్యుత్‌ను తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.1,000 కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకొచి్చంది. ఈ నేపథ్యంలో జెన్‌కోకు రుణమిచ్చేందుకు పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top