breaking news
Genco Power
-
వేసవికల్లా మరో 1,600 మెగావాట్లు రెడీ
సాక్షి, అమరావతి: వచ్చే వేసవికల్లా మరో 1,600 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం (ఒక్కొక్కటీ 800 మెగావాట్లు)లోని కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు మార్చి ఆఖరు నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేలా ఏపీ జెన్కో సన్నాహాలు చేస్తోంది. దీంతో ప్రస్తుతం 5 వేల మెగావాట్లున్న జెన్కో విద్యుత్ ఉత్పత్తి 6,500 మెగావాట్లకు చేరుతుంది. థర్మల్ ప్లాంట్ల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగకుండా ప్రతి చోటా కర్బన ఉద్గారాలు తగ్గించే (ప్యూయెల్ గ్యాస్ డీ సల్ఫరైజేషన్) ప్లాంట్ల ఏర్పాటును కేంద్ర పర్యావరణ శాఖ తప్పనిసరి చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్టు నిబంధనలను న్యాయ సమీక్షకు పంపామని, అనుమతి రాగానే మరో వారం రోజుల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామని జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు ఎఫ్‌జీడీ పనులు జరుగుతుండగానే థర్మల్ ప్లాంట్ల వాణిజ్య కార్యకలాపాలు చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. ఆ ఐదేళ్లూ నత్తనడకే ► కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో, అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటును 2015లో ప్రారంభించారు. ఇవి 2018 నాటికే పూర్తవ్వాలి. కానీ అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇచ్చింది. మరోవైపు కాంట్రాక్టు సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. పనులు ముందుకు సాగకపోవడంతో ప్లాంట్ల నిర్మాణం ఆలస్యమైంది. దీనివల్ల మరోవైపు ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగింది. స్పీడ్ పెంచిన జగన్ సర్కార్ ► ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జెన్కోకు స్థాయికి మించిన అప్పులున్నాయి. దీంతో కొత్తగా అప్పులు అందే పరిస్థితి లేకుండా పోయింది. కానీ పనుల్లో మరింత జాప్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. విద్యుత్ ధర కూడా ఎక్కువయ్యే వీలుంది. ధర ఎక్కువ ఉంటే తరచూ ఉత్పత్తిని ఆపేసి, తక్కువ ధర విద్యుత్‌ను తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.1,000 కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకొచి్చంది. ఈ నేపథ్యంలో జెన్కోకు రుణమిచ్చేందుకు పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి. -
కొత్త విద్యుత్ ప్లాంట్లు అవసరమే
నూతన ఎత్తిపోతల పథకాలు,పరిశ్రమలతో పెరగనున్న డిమాండ్ వచ్చే ఏడాది పీక్ డిమాండ్ అంచనా 17,041 మెగావాట్లు మరో మూడేళ్లలో 20 వేల మెగావాట్లకు పెరిగే అవకాశం తక్కువ వ్యయంతో కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం ఈఆర్సీ బహిరంగ విచారణలో జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సాక్షి, హైదరాబాద్: భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపట్టిందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీ డి.ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. మూడు నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, కొత్త ఎత్తిపోతల పథకాలు రానుండటంతో విద్యుత్ అవసరాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలోని జెన్కో విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి 2017–19 మధ్య ఉత్పత్తి కానున్న విద్యుత్ ధరల నిర్ధారణ కోసం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో ప్రభాకర్‌రావు మాట్లాడారు. 2018–19లో రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,041 మెగావాట్లకు పెరుగుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనా వేసిందని అన్నారు. మరో మూడు నాలుగేళ్లలో పీక్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పెరిగే అవకాశముందని చెప్పారు. పాతబడిన 3 విద్యుత్ ప్లాంట్లను మూడు నాలుగేళ్లలో మూసేయక తప్పదని, ఈ నేపథ్యంలోనే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నామన్నారు. జెన్కో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం మెగావాట్‌కు రూ.4.7 కోట్లకు మించడం లేదని, అదే ఇతర రాష్ట్రాల్లో రూ.5 కోట్లకు పైనే ఉంటోందన్నారు. అంత విద్యుత్ అవసరమా..: నిపుణులు మూడు నాలుగేళ్లలో జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 24,000 మెగావాట్లకు పెంచేందుకు భారీగా కొత్త విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నారని, వాస్తవానికి రాష్ట్రంలో అంత భారీ మొత్తంలో విద్యుత్ డిమాండ్ ఉండదని విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల రావు, ఎం.తిమ్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. డిస్కంల తాజా అంచనాల ప్రకారం 2017–18లో 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగిలిపోనుందని, దీంతో ఆ మేర విద్యుదుత్పత్తి తగ్గించేందుకు బ్యాకింగ్ డౌన్ చేయక తప్పదన్నారు. బ్యాకింగ్ డౌన్ చేసినా స్థిర చార్జీల రూపంలో వినియోగదారులపై రూ.వందల కోట్ల భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కొత్త పీపీఏలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జెన్కో విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పీపీఏలు, నిర్మాణ వ్యయం, నిర్మాణ వ్యవధి, ఆలస్యంతో పెరిగిన వ్యయాలు తదితర వివరాలు బయటపెట్టకుండానే విద్యుత్ టారీఫ్‌పై బహిరంగ విచారణ నిర్వహించడం సరికాదన్నారు. ఈ వివరాలు లేకుండా పారదర్శకంగా టారీఫ్ నిర్థారణ సాధ్యం కాదన్నారు. కాగా, తెలంగాణ జెన్కో విద్యుత్ ధరలపై ఏపీ డిస్కంలు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానమిచ్చారు. ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు హెచ్ శ్రీనివాసులు, జెన్కో డైరెక్టర్ కేఆర్కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.