మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్

AP Govt Issued Orders For Liquor Shop License Renewal - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెలాఖరుతో మద్యం పాలసీ ముగుస్తున్నందున ప్రస్తుతమున్న 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఏడాది పాటు లైసెన్సు రెన్యువల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో మద్యపానంతో కలిగే దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ శుక్రవారం జీవో జారీ చేశారు. గతేడాది అక్టోబర్‌ 1న ప్రకటించిన పాలసీలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే రిటైల్‌ మద్యం దుకాణాలను నిర్వహించేలా ఏడాదికి లైసెన్సు జారీ చేశారు. అప్పట్లో ఉన్న 4,380 షాపులను 33 శాతం తగ్గించడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,934 షాపులు నడుస్తున్నాయి. వీటికి వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరు వరకు లైసెన్సులను జారీ చేస్తారు. 

► 2,934 షాపులను మాత్రమే నిర్వహించాలి. ఈ సంఖ్య పెరగకుండా వాక్‌ ఇన్‌ షాపులు (ఎలైట్‌ షాపులు) ఏర్పాటుకు అనుమతించింది.  
► జాతీయ రహదారుల వెంబడి మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు నిబంధనలు గట్టిగా అమలుపరచాలి. తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి అలిపిరి వరకు, వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్‌ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఎస్వీఆర్‌ఆర్‌ ఆస్పత్రి, స్విమ్స్‌ ఆస్పత్రి వరకు మద్యం షాపులకు అనుమతి లేదు. 
► ఏపీఎస్‌బీసీఎల్‌ ఆధ్వర్యంలో ఈ మద్యం షాపులు నడుస్తాయి. మద్యం షాపుల్లో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం అమలయ్యేలా చూడాలి. దీనివల్ల అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు.      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top