మరిన్ని పెట్టుబడులు

AP Government green signal for 10 projects - Sakshi

రూ.19,037 కోట్ల విలువైన 

10 ప్రాజెక్టులకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, అమరావతి: స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహి­స్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలి­పింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నా­యి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగా­వకా­శాలు లభించనున్నాయి.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యా­లయంలో సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మో­హన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెట్టుబ­డుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఈ ప్రతిపా­దనలకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామి­కరంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. వీట­న్నింటినీ అధికారులు తెలుసుకుంటూ ప్రపంచ పారిశ్రామిక రంగం పోకడలను అర్థంచేసు­కోవడం ద్వారా ఎప్పటికప్పుడు పారిశ్రామిక విధానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని  సూచించారు.

అత్యంత పారదర్శక విధానాల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చా మని.. ఈ క్రమంలోనే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో దేశంలోనే ప్రథమస్థానంలో నిలి­చామని ముఖ్యమంత్రి జగన్‌ గుర్తుచేశారు. పరిశ్రమలపట్ల సానుకూల క్రియాశీలతను మరింత బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగించాలన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే అనుమతులు, తదితర అంశాల్లో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోందని, ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌కాల్‌ దూరంలో ఉన్నామన్న భరోసాను వారికి కల్పిస్తున్నామన్నారు. కానీ, అనుమతులు, క్లియరెన్స్‌ విషయంలో ఇప్పుడున్న వేగాన్ని మరింతంగా పెంచాల్సిన అవసరం ఉందని, పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలపట్ల చురుగ్గా వ్యవహరించడంతో పాటు, వాటికి త్వరగా అనుమతులు మంజూరు చేసే ప్రక్రియ వేగాన్ని ఇంకా పెంచాల్సిందిగా అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 

జీఐఎస్‌ ఒప్పందాల అమలును వేగవంతం చేయండి..
ఇక విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు విషయంలో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కోరారు. పరిశ్రమలకు ప్రోత్సాహ­కాల విషయంలో గత ప్రభుత్వంలో కన్నా ఈ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున మేలు చేకూర్చామని, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల రంగానికి పునరుజ్జీవం కల్పించిన విష­యాన్ని సీఎం గుర్తుచేశారు. పారిశ్రామిక ప్రోత్సా­హకాలను ఇస్తూ వారికి చేదోడుగా నిలవడం ద్వారా ఎంఎస్‌ఎంఈల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలతతో ముందుకు సాగుతోందన్నారు.

ఈ రంగంపై ఎక్కువమంది ఆధారపడి బతుకు­తు­న్నారు కాబట్టి.. వీటిని కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతన్నారు.  ఈ సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. పురపాలక, పట్టణాభివద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌.. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యా­టకశాఖ మంత్రి ఆర్కే రోజా, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌భార్గవ్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె. విజయానంద్, ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌. యువరాజ్,  పరిశ్రమలు, వాణిజ్యశాఖ (చేనేత, జౌళి) ముఖ్యకా­ర్యదర్శి కె. సునీత, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన కంపెనీల వివరాలు..

  • చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయనున్న పెప్పర్‌ మోషన్‌ కంపెనీ. రూ.4,640 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 8080 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
  • విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం. దీనిద్వారా రూ.531 కోట్ల పెట్టుబడి, 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగానూ ఉద్యోగాలు లభిస్తాయి.
  • శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.1,750 కోట్ల పెట్టుబడితో శ్రేయాస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పరిశ్రమ ఏర్పాటు. ఇందులో 2,000 మందికి ప్రత్యక్షంగానూ, మరో 500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు.
  • అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో స్మైల్‌ (సబ్‌స్ట్రేట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండియా లిమిటెడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌) కంపెనీ ఆధ్వర్యంలో రూ.166 కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు. దీనిద్వారా దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలు. 
  • నెల్లూరు జిల్లా కష్ణపట్నం వద్ద కోస్టల్‌ ఆంధ్రా పవర్‌ లిమిటెడ్‌ (రిలయెన్స్‌ పవర్‌) తన పారిశ్రామిక కార్యకలాపాన్ని మార్చుకునేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం. థర్మల్‌ పవర్‌ స్థానంలో రూ.6,174 కోట్ల పెట్టుబడితో కొత్త తరహా, సాంప్రదాయేతర పర్యావరణహిత గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటుకు ఆమోదం. దీనిద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 2,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగావకాశాలు.
  • తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద ఆంధ్ర పేపర్‌ లిమిటెడ్‌ రూ.4వేల కోట్ల పెట్టుబడితో సంస్థను విస్తరించనుంది. తద్వారా 3వేల మందికి ఉద్యోగాలు.
  • విశాఖ జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో ఏటీసీ టైర్స్‌ లిమిటెడ్‌ కూడా రూ.679 కోట్ల పెట్టుబడితో విస్తరణ. తద్వారా 300 మందికి ఉద్యోగాలు.
  • తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో ఎలక్ట్రో స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ సైతం రూ.933 కోట్ల పెట్టుబడి సంస్థను విస్తరించనుంది. 2,100 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
  • ఏలూరు జిల్లా కొమ్మూరు వద్ద రూ.114 కోట్ల పెట్టుబడి పెట్టనున్న శ్రీ వెంకటేశ్వర బయోటెక్‌ లిమిటెడ్‌కు ఎస్‌ఐపీబీ ఆమోదం. దీనిద్వారా 310 మందికి ఉద్యోగాలు. 
  • విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది వద్ద రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఓరిల్‌ ఫుడ్స్‌ లిమి­టెడ్‌. దాదాపుగా 550 మందికి ఉద్యోగాలు వస్తాయి.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top