ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భేటీ

AP Cabinet Sub Committee Meeting On Sugar Factories Problems - Sakshi

చెరకు ఉత్పత్తిపై ప్రత్యేక కార్యాచరణ

చెరకు కర్మాగారాల సమస్యలపై చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం

సాక్షి, అమరావతి: చెరకు కర్మాగారాల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స, మేకపాటి, కన్నబాబు పాల్గొన్నారు. షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకోసం చేపట్టవలసిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉత్తరాంధ్రలో చెరకు ఉత్పత్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచించారు. (చదవండి: మూడు రాజధానులు పెట్టి తీరుతాం: కొడాలి నాని)

చక్కెర కర్మాగారాల సమస్యలు ఆర్థిక, పౌరసరఫరాల శాఖతో కూడా ముడిపడి ఉన్నందున మరో సమావేశం ఏర్పాటు చేయాలని, తరువాత సమావేశానికి ఆయా శాఖల కార్యదర్శులను కూడా   పిలవాలని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు మంత్రి మేకపాటి సూచించారు. పర్మినెంట్, సీజనల్ ఉద్యోగుల సంఖ్య, వారి జీతాల గురించి మంత్రి బొత్స సత్యనారాయణ అడిగి తెలుసుకున్నారు.శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు సహకార చక్కెర కర్మాగారం గురించి మంత్రి మేకపాటి వివరించారు. స్థానిక చెరకు రైతుల అవసరమైన వ్యవసాయ ఆధారిత ఆహార శుద్ధి యూనిట్ల  ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, జపాన్ సంస్థలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని సహచర మంత్రులకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. (చదవండి: ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..)

వచ్చే సీజన్‌లో ఫ్యాక్టరీల పునరుద్ధరణకు ఇప్పుడే కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సూచించారు. 6 చక్కెర కర్మాగారాలకు కేటాయించిన భూములు, వాటి విలువపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. పనిచేయని షుగర్ ఫ్యాక్టరీల గత బకాయిలు, విడుదల చేసిన నిధుల వినియోగంపై మంత్రులు ఆరా తీశారు. చిత్తూరు, నెల్లూరు, కడప, విశాఖలోని చక్కెర ఫ్యాక్టరీల ఆర్థిక పరిస్థితి, యంత్రాల స్థితిపై మంత్రులు వాకబు చేశారు.

దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చక్కెర అవసరాలు, కొనుగోలు వివరాలపైనా చర్చ జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో కర్మాగారాల్లో ఉత్పత్తి అయ్యే చక్కెరను స్థానిక పౌరసరఫరాల శాఖకు పంపిణీ చేసే పద్ధతి గురించి షుగర్, కేన్  కమిషనర్ వెంకట్రావు ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, షుగర్స్ డైరెక్టర్ వెంకట్రావ్ , చక్కెర కర్మాగారాల ప్రతినిధులు హాజరయ్యారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top