నరసన్న రథం రెడీ

Antarvedi chariot Trail Run Sucess - Sakshi

అంతర్వేది నూతన రథం ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

ఏడంతస్తులు.. 43 అడుగుల ఎత్తుతో నిర్మాణం

రూ.1.10 కోట్ల వ్యయం  భక్తుల మనోభావాలకు అగ్రాసనం

గడువుకు ముందే ఆలయానికి అప్పగింత

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. 2021లో జరగబోయే స్వామివారి కల్యాణోత్సవం నాటికి కొత్త రథాన్ని సిద్ధం చేస్తామని భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చింది. అందుకు అనుగుణంగా రెండున్నర నెలల్లోనే రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భక్తుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. రథానికి రంగులు వేసే పని ఒక్కటే మిగిలి వుంది. నరసన్న కల్యాణోత్సవ సమయానికి రథం లేదనే మాట రానివ్వకూడదని ప్రభుత్వం దీని నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

రెండున్నర నెలల్లోపే..
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం జూన్‌ 8 అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దగ్ధమైన విషయం విదితమే. దీనిని ఆసరా చేసుకుని కొన్ని రాజకీయ శక్తులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడితో ఆగిపోకుండా భక్తుల మనోభావాలను పరిరక్షించే లక్ష్యంతో ఘటన చోటుచేసుకున్న రెండో రోజే ప్రత్యేకత కలిగిన కొత్త రథం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విలువైన కలప, ఇతర సామగ్రిని ఆగమేఘాలపై సేకరించి అక్టోబర్‌ 21న రథం నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపు రెండున్నర నెలల్లోపే పూర్తి చేయించారు. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న జరిగే రథోత్సవం నాటికి పూర్తి చేయాలని సంకల్పించగా.. అంతకంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా తమ మనోభావాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్రయల్‌ రన్‌ విజయవంతం
రథానికి సోమవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించగా విజయవంతమైంది. సంప్రదాయం ప్రకారం అంతర్వేది పల్లిపాలేనికి చెందిన మత్స్యకారులే రథాన్ని ప్రయోగాత్మకంగా లాగారు. రథానికి వారే పసుపు, కుంకుమ అద్ది ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

ఏడంతస్తులు.. 43 అడుగుల ఎత్తు..
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 43 అడుగుల ఎత్తున.. 7 అంతస్తులతో రథ నిర్మాణం పూర్తయ్యింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రథానికి బ్రేకులు, జాకీ కూడా ఏర్పాటు చేశారు. జాకీ ఏర్పాటు చేయడం వల్ల రథం సులభంగా మలుపు తిరిగేందుకు వీలవుతుంది. బ్రేకుల ఏర్పాటుతో ప్రమాద రహితంగా ఉంటుంది. మొత్తంగా రథం నిర్మాణం కోసం రూ.1.10 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. పాత రథానికి బర్మా టేకు వాడగా.. నూతన రథ నిర్మాణంలో 1,330 ఘనపుటడుగుల బస్తర్‌ టేకును వినియోగించారు.  

ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం ఇదే తొలిసారి
నేను తయారు చేసిన వాటిలో 81వ రథం ఇది. దీనికి 70 రోజులు పట్టింది. నా 21 ఏళ్ల రథాల తయారీ జీవిత ప్రస్థానంలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇంత వేగంగా రథాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి.
 – సింహాద్రి గణపతిశాస్త్రి, రథం తయారీదారు
 
చాలా బాగుందయ్యా!
 ఇంత తక్కువ వ్యవధిలో రథం నిర్మాణాన్ని పూర్తి చేయడంతో ప్రభుత్వ కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరో 150 ఏళ్ల వరకూ ఈ రథానికి ఢోకా లేదు.
– మల్లాడి వెంకటరెడ్డి, మత్స్యకారుడు, అంతర్వేది పల్లిపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top