ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే

Anil Kumar Singhal Serious On Private Hospitals - Sakshi

కరోనా చికిత్సకు ఎక్కువ వసూలు చేస్తే ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు

చిన్నారుల కోసం ఆస్పత్రుల్లో మౌలిక వసతులు

పల్లెలో పెరుగుతున్నాయనడం అవగాహన రాహిత్యం

ఆనందయ్య మందుపై స్పష్టత రావాలి

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందించాల్సిన పేషెంట్ల నుంచి డబ్బు వసూలు చేస్తే ఆయా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ హెచ్చరించారు. ఇటీవలే వివిధ వైద్య వర్గాలు, ఆస్పత్రుల యాజమాన్యాలను సంప్రదించి చికిత్సకు రేట్లు పెంచామని, వీటిని కూడా కాదని పేషెంట్ల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు డబ్బు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలు ఆస్పత్రులకు జరిమానా విధించామన్నారు. రోజూ నోడల్‌ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులను పర్యవేక్షిస్తారని తెలిపారు.

పలువురు నిపుణులు, వైద్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చిన్నపిల్లల్లో కేసులు వస్తే ఎలాంటి వసతులు కల్పించాలన్న దానిపై కమిటీ వేశామన్నారు. వెంటిలేటర్లు, ప్రత్యేక వార్డులు, మరికొన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, దీన్నిబట్టి అన్ని ఆస్పత్రుల్లో ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సరిగా అమలు కానందునే పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయని రాయడం అవగాహన రాహిత్యమన్నారు. పట్టణాల్లో 1.46 కోట్ల జనాభా, పల్లెల్లో 3.49 కోట్ల జనాభా ఉందని చెప్పారు. తాజాగా వచ్చిన కేసులను బట్టి చూస్తే లక్ష జనాభాకు పల్లెల్లో 248, పట్టణాల్లో 383 కేసులు వచ్చాయన్నారు. మే 16 నుంచి 22 వరకు వారం రోజుల గణాంకాల్లో ఈ మేరకు తేలిందన్నారు. ఆ వారంలో 1,42,707 కేసులు నమోదయ్యాయని, వాటిలో పట్టణాల్లో 56,058, గ్రామాల్లో 86,649 కేసులు ఉన్నాయని వివరించారు. కేసుల్ని జనాభా ప్రాతిపదికన లెక్కించాలని, అది అవగాహన లేక కొన్ని పత్రికల్లో పల్లెల్లో ఎక్కువగా కేసులు వస్తున్నట్టు రాశారని పేర్కొన్నారు.

ఈ ఏడాది ఎక్కువమంది నియామకం
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్యశాఖలో 1,448 మందిని ఎక్కువగా నియమించినట్లు చెప్పారు. గత ఏడాది 17,315 మందిని నియమించగా, ఈ ఏడాది 18,763 మందిని నియమించినట్టు తెలిపారు. ఇందులో మెడికల్‌ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు అందరూ ఉన్నారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 23.81 లక్షల మందికి రెండు డోసులు, 36.49 లక్షల మందికి ఒక డోసు టీకా వేసినట్లు చెప్పారు. 1.41 లక్షల కోవాగ్జిన్, 13.88 లక్షల కోవిషీల్డ్‌ స్టాకు ఉందన్నారు. కోవాగ్జిన్‌ సెకండ్‌ డోసు వారికి, కోవిషీల్డ్‌ మొదటి డోసు వారికి వాడతామన్నారు.

సోమవారం నాటికి ఆనందయ్య మందుపై స్పష్టత
ఆనందయ్య మందు నమూనాలు హైదరాబాద్‌ ల్యాబొరేటరీకి, సెంట్రల్‌ ఆయుర్వేదిక్‌ ల్యాబొరేటరీకి వెళ్లాయని చెప్పారు. సోమవారం నాటికి దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మందుల్లో వాడిన దినుసుల మిక్సింగ్‌ ఎలా ఉంది, మందు వాడితే నష్టం ఉందా, ఫలితాలు ఏమేరకు కనిపించాయి అన్నదానిపై మందు వాడిన వారినుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారని, దీనిపై స్పష్టత రాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

ఒకేరోజు రికార్డు స్థాయిలో 812 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌
రాష్ట్రంలో సెకండ్‌వేవ్‌లో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఒకేరోజు 812 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను తీసుకొచ్చామన్నారు. కేంద్రం మనకు 590 మెట్రిక్‌ టన్నులే కేటాయించినా అడ్‌హక్‌ ప్రాతిపదికన ఎక్కువ తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వారం రోజులుగా చూస్తే కేసులు తగ్గుతున్నాయని, ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల లభ్యత చూస్తే ఇది అర్థమవుతుందని చెప్పారు. తాజాగా 3,552 ఆక్సిజన్‌ పడకలు, 812 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజురోజుకు అడ్మిషన్లు తగ్గుతున్నాయని, డిశ్చార్జిలు పెరుగుతున్నాయని తెలిపారు.

చదవండి: కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం 
యాస్‌ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top