అరచేతిలో ఆలయ సమాచారం

Andhra Pradesh Temples information in mobile - Sakshi

భక్తుల సెల్‌ఫోన్లకు ఎప్పటికప్పుడు రోజువారీ కార్యక్రమాల వివరాలు  

ముందుగా 175 దేవాలయాల వివరాలు సోషల్‌ మీడియాకు అనుసంధానం 

దేవదాయ శాఖ సరికొత్త నిర్ణయం 

సాక్షి, అమరావతి: తరచూ ఆలయాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం దేవదాయ శాఖ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా వారికి అందజేయాలని సంకల్పించింది. ఈ నిర్ణయం విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండే వారితోపాటు రాష్ట్రంలోనూ ఆలయ సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో వెతికేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దూర ప్రాంతాల్లో ఉండే భక్తులకు ఈ సమాచారం ఎప్పటికప్పుడు తెలీక ఆయా దేవాలయాల్లోని విశేష కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు అందజేసేందుకు వారు ఎక్కువగా ఉపయోగించే సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు దేవదాయ శాఖాధికారులు వెల్లడించారు. 

మొదటి దశలో 175 ఆలయాల సమాచారం 
ఈ తరహా సమాచారాన్ని ముందుగా దేవదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల కేటగిరీలో ఉన్న 175 గుళ్ల సమాచారాన్ని భక్తులకు చేరవేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఇప్పటివరకు వివిధ ఆలయాల్లో భక్తులు దర్శన లేదా పూజా టికెట్ల కొనుగోలు సమయంలో ఇచ్చిన ఫోన్‌ నంబర్లను వినియోగించుకోవాలని భావిస్తోంది. వాటి ఆధారంగా భక్తులకు వివిధ ఆలయాల్లోని పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తారు. ఆన్‌లైన్‌లో టికెట్ల కొనుగోలుతో పాటు ఆలయం వద్ద బస సౌకర్యం కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తారు. మరోవైపు.. ఈ సమాచారాన్ని సోషల్‌ మీడియాకు అనుసంధానం చేసేందుకు.. ఆయా కార్యక్రమాలకు డిజిటల్‌ మార్కెటింగ్‌ కల్పించేందుకు ఒక ఏజెన్సీని ఎంపిక చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే టెండరు ప్రక్రియను చేపట్టింది.   

ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకు చేరువయ్యేలా.. 
రాష్ట్రంలో ఉండే ఆలయాలను ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాలను మొబైల్‌ ద్వారా భక్తులు తెలుసుకునేలా యూజర్‌ ఫ్రెండ్లీగా ఈ ప్రక్రియను రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. 
– వాణీమోహన్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top