Pulichintala Project Repair Works: ‘పులిచింతల’ చకచకా

Andhra Pradesh: Repair Work Of Pulichintala Project Is Going Fastly - Sakshi

సాక్షి, నరసరావుపేట/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు మరమ్మతు పనులు చకచకా సాగుతు న్నాయి. ప్రాజెక్టు మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22.04 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే వర్షాకాలం నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 45.77 టీఎంసీలు నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పులిచింతలలో 2019–20లో 45.77 టీఎంసీలు, 2020–21లో 45.77 టీఎంసీలు, 2021–22లో 44.53 టీఎంసీలు, 2022–23లో 45.77 టీఎంసీలు నీటిని నిల్వ చేశారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడం ప్రారంభించిన నాటినుంచి కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం విశేషం.

16వ గేట్‌ స్థానంలో రేడియల్‌ గేట్‌ నిర్మాణం
గత ప్రభుత్వాలు నిర్మాణం, నిర్వహణలో అలసత్వం వల్ల డ్యామ్‌ 16వ గేట్‌ 2021 ఆగస్ట్‌ 5న వరద ఉధృతికి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 16వ గేట్‌ స్థానంలో స్టాప్‌ లాగ్‌ గేట్‌ను యుద్ధప్రాతిపదికన అమర్చి నీటిని నింపి రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంది. తర్వాత 40 టీఎంసీలకు పైగా నీటితో ప్రాజెక్టు కళకళలాడింది. ఈ గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రూ.7.54 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో రేడియల్‌ గేట్‌ ఏర్పాటు, దాన్ని అమర్చేందుకు అవసరమైన కాంక్రీటు దిమ్మెలు, క్రేన్స్‌ నిర్మాణాలు చేపడుతున్నారు.

మే చివరి నాటికి అన్ని పనులు పూర్తి
పులిచింతల ప్రాజెక్టు 16వ రేడియల్‌ గేట్‌ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గేట్ల అమరికకు అవసరమైన పనులు పూర్తయ్యాయి. ఇక గేట్లను ఆ స్థానంలో అమర్చి ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. అన్ని పనులు మే చివరి నాటికి పూర్తి చేస్తాం. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టులో నీటి నిల్వకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం
– రామకృష్ణ, ఎస్‌ఈ, పులిచింతల ప్రాజెక్టు

మరమ్మతులు, నిర్వహణకు రూ.9.57 కోట్లు
పులిచింతల ప్రాజెక్టుకు మొత్తం 24 రేడియల్‌ గేట్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు తరచూ వివిధ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తుండటం, వందలాది టీఎంసీల నీరు ప్రాజెక్టు నుంచి కిందకు వెళుతున్న నేపథ్యంలో కొన్ని మరమ్మతులు చేయాల్సి వస్తోంది. వీటన్నింటికి ప్రభుత్వం రూ.9.57 కోట్లు ఖర్చు చేస్తోంది. రేడియల్, స్లూయిజ్‌ గేట్లు, క్రేన్లకు గ్రీజు, పెయింట్, గడ్డర్ల పటిష్టం వంటి పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా డ్యామ్‌ గేట్ల పిల్లర్ల పటిష్టానికి రూ.1.73 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ పనులు సైతం ముమ్మరంగా సాగుతున్నాయి. డ్యామ్‌ రేడియల్‌ గేట్లకు చేరుకునే నడక దారి పునరుద్ధరణకు రూ.3.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రాజెక్టు పైనుంచి వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. గతంలో ఈ మార్గం నుంచి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు నుంచి తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు కొనసాగేవి.

(చదవండి: బ్యాంకుల నుంచి పింఛన్‌ డబ్బు విత్‌డ్రా.. ఇకపై ఒక్కరు కాదు ఇద్దరు.. )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top