
సాక్షి, అమరావతి: సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద ఆయా సొసైటీలు సమర్పించే వార్షిక జాబితాలను ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం సొసైటీల రిజిస్ట్రార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సొసైటీలు అందించిన వివరాలు తనకు అందినట్లు ధ్రువీకరించడం (అక్నాలడ్జ్) మినహా వాటి ఆమోదం, తిరస్కారం విషయంలో రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకోజాలరని పేర్కొంది. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి) ఆఫీస్ బేరర్లకు సంబంధించి డాక్టర్ మంతెన నరసరాజు తదితరులు సమర్పించిన సవరణ జాబితాను ఆమోదించి, మరికొందరు డాక్టర్లు సమర్పించిన జాబితాను సొసైటీల రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
రిజిస్ట్రార్ ఇచ్చిన ఎండార్స్‌మెంట్‌ను రద్దుచేసింది. ఆఫీస్ బేరర్ల వివాదం తేలేంతవరకు ఇరుపక్షాలు సమర్పించిన జాబితాను రికార్డుల్లో ఉంచాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి సంబంధించిన ఆఫీస్ బేరర్ల విషయంలో డాక్టర్ మంతెన నరసరాజు తదితరులు సమర్పించిన జాబితాను ఆమోదించి, తమ దరఖాస్తును సొసైటీ రిజిస్ట్రార్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ పోలవరపు రాఘవరావు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ సోమయాజులు మంగళవారం తీర్పు చెప్పారు. ఈ వ్యవహారంలో అనేక వివాదాస్పద విషయాలున్నాయని, ఈ కోర్టు వాటి జోలికి వెళ్లడంలేదని తెలిపారు. ఇరుపక్షాలు చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను, న్యాయపరమైన మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్‌కు ఇరుపక్షాలు సమర్పించిన జాబితాలు సంబంధిత కోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.