ఎక్స్ సర్విస్‌మెన్ భూముల విషయంలో హైకోర్టు తీర్పు
భూమిని సాగు చేస్తుంటే డీఫాం పట్టా లాంఛనమే అవుతుంది
ఆ భూమిని అమ్ముకునేందుకు సైతం హక్కులు ఉంటాయి
సాక్షి, అమరావతి: ఎక్స్ సర్విస్‌మెన్ కోటా కింద సైనికోద్యోగులకు ప్రొవిజినల్ (తాత్కాలికం) అసైన్‌మెంట్ ద్వారా కేటాయించిన భూమిపై వారికి సర్వ హక్కులు ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రొవిజినల్ అసైన్‌మెంట్ కింద పొందిన భూమిని సాగు చేస్తుంటే డీఫాం పట్టా జారీ అన్నది కేవలం లాంఛనం మాత్రమేనని స్పష్టం చేసింది. డీఫాం పట్టా ఆలస్యంగా జారీ అయిందన్న కారణంతో ఎక్స్ సర్విస్‌మెన్ కోటా కింద సైనికోద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలను దక్కకుండా చేయలేరని పేర్కొంది. గత 40 ఏళ్లుగా అప్పిలెట్ తనకు కేటాయించిన భూమిని సాగు చేసుకుంటున్న నేపథ్యంలో, ఆ భూమిని అమ్ముకునేందుకు అతనికి హక్కులు ఉన్నాయని తెలిపింది.
అలాగే ఇసుక దిబ్బల పోరంబోకు భూమిని అసైన్‌మెంట్ కింద ఇవ్వడానికి వీల్లేదన్న ప్రభుత్వ వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే సర్వే నంబర్‌లోని ఇసుక దిబ్బల పోరంబోకు భూమిని ప్రభుత్వం ఇతరులకు సైతం అసైన్‌మెంట్ కింద ఇచ్చిందని, వారు ఆ భూమిని వీఎంఆర్‌డీఏకి అప్పగించి, అందుకు ప్రతిగా ప్లాట్లు పొందారని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు అప్పిలేట్‌కి కేటాయించిన ఇసుక దిబ్బ భూమిపై ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతుందో అర్థం కావడం లేదని పేర్కొంది.
ఎక్స్ సర్విస్‌మెన్ కోటా కింద అసైన్‌మెంట్ భూమి పొందేందుకు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, సర్విసులో ఉన్న సైనికోద్యోగులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసులో మాజీ సైనికోద్యోగి అప్పారావు భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లో నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్
విశాఖపట్నానికి చెందిన వీసీ అప్పారావు నౌకాదళంలో పనిచేసి 1989లో పదవీ విరమణ చేశారు. సర్వీసులో ఉండగానే ఆయనకు ఎక్స్ సర్విస్‌మెన్ కోటా కింద ప్రభుత్వం 1978లో భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 75–2లో 5.10 ఎకరాల భూమిని అసైన్‌మెంట్ కింద ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం ఈ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌ను కోరగా తిరస్కరించారు. దీంతో అప్పారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కలెక్టర్ అభ్యంతరాలపై వివరణ ఇస్తూ తిరిగి ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని అప్పారావును ఆదేశించారు.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పారావు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. అప్పారావు తరఫు న్యాయవాది జీఎల్ నరసింహారెడ్డి వాదనలు వినిపించారు. సర్విసులో ఉండగా ఇచ్చిన అసైన్‌మెంట్‌ను ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని, దానిని 10 ఏళ్ల తర్వాత అమ్ముకునేందుకు హక్కు ఉంటుందని వివరించారు. కలెక్టర్ ఏకపక్షంగా అప్పారావు భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, అప్పారావు భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.


