
దర్యాప్తునకు ఏ విధంగా ఆటంకం కలిగిస్తారు?
పీఎస్సార్‌పై జత్వానీ కేసులో సీఐడీకి హైకోర్టు ఆదేశం
శాఖాపరమైన విచారణలో చెప్పినదాన్ని పరిగణనలోకి తీసుకోం
అదేమైనా సీఆర్‌పీసీ సెక్షన్ 161 లేదా 164 వాంగ్మూలమా?
ఇది తప్పుడు కేసు అని సంబంధిత కోర్టు ఇప్పటికే అభిప్రాయపడింది
విచారణను ఎలా అడ్డుకుంటారో చెప్పాలని ఏజీకి స్పష్టీకరణ
ఏపీపీఎస్‌సీ కేసులోనూ పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం
సాక్షి, అమరావతి: సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేయగలరో, దర్యాప్తునకు ఏ విధంగా ఆటంకం కలిగించగలరో చెప్పాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దీని ఆధారంగా బెయిల్ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో బెయిల్ కోరుతూ పీఎస్సార్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నాగేష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, గత 30 రోజులుగా పీఎస్సార్ ఆంజనేయులు జైల్లో ఉన్నారని తెలిపారు. దర్యాప్తు పూర్తయిందన్నారు. ఆధారాలన్నీ సేకరించిన నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదన్నారు.
దర్యాప్తును ఎలా అడ్డుకుంటారు?
సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదుదారు జత్వానీకి విరుద్ధంగా ఆంజనేయులు, ఇతర అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఇదే విషయాన్ని ఈ కుట్రలో పాలుపంచుకున్న మరో ఐపీఎస్ అ«ధికారి విశాల్ గున్నీ శాఖాపరమైన విచారణ సందర్భంగా చెప్పారని తెలిపారు. ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేస్తారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, శాఖాపరమైన విచారణలో చెప్పిన వివరాలను తామెలా పరిగణనలోకి తీసుకుంటామని ప్రశ్నించారు.
సీఆర్‌పీసీ సెక్షన్ 161 లేదా 164 వాంగ్మూలం అయి ఉంటే దానిని పరిగణనలోకి తీసుకుని ఉండేవారమన్నారు. ఈ కేసు తప్పుడు కేసు అని సంబంధిత కోర్టు ఇప్పటికే అభిప్రాయపడిందని గుర్తు చేశారు. పిటిషనర్‌కు బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో, దర్యాప్తును ఏ విధంగా అడ్డుకుంటారో చెప్పాలని అడ్వొకేట్ జనరల్‌కు స్పష్టం చేశారు. దీని ఆధారంగా బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని, అవసరమైన కఠిన షరతులు విధిస్తామని తెలిపారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
పీఎస్సార్‌పై ఏపీపీఎస్సీ కేసులో పూర్తి వివరాలు సమర్పించండి
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్‌సీ అప్పటి అదనపు కార్యదర్శి పెండ్యాల సీతారామాంజనేయులుపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని సీతారామాంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తనపై పోలీసులు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, తాను అమాయకుడినని పీఎస్సార్ ఆంజనేయులు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా, ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసులో పీఎస్సార్ ఆంజనేయులు రిమాండ్ గురువారంతో ముగిసింది. దీంతో ఆయన్ను పోలీసులు 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరిచారు. వచ్చేనెల 5వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.