Andhra Pradesh: అభి'వృద్ధి'లో అగ్రగామి

Andhra Pradesh growth rate has set record in 2022 - Sakshi

2021–22లో దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన ఘనత ఏపీకి 

స్థిర ధరల ఆధారంగా 11.43 శాతం ఏపీలో అత్యధిక వృద్ధి 

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు మంత్రిత్వ శాఖతో పాటు ఆర్‌బీఐ వెల్లడి 

వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో రెండంకెల వృద్ధి 

కోవిడ్‌ సంక్షోభంలోనూ వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ఏపీలో అత్యధిక ప్రాధాన్యత 

ఆదాయం తగ్గినా ప్రజల జీవనోపాధి కోసం నిరాటంకంగా ‘నవరత్నాలు’ అమలు 

ప్రజల కొనుగోలు శక్తి పెరగడంవల్లే వృద్ధిలో ఏపీ నంబర్‌ వన్‌ 

2021–22లో 12.78 శాతం మేర ఏపీలో పారిశ్రామిక రంగం వృద్ధి  

బాబు హయాంలో ఏనాడు ఈ రంగంలో రెండంకెల వృద్ధిలేదు 

సాక్షి, అమరావతి: వృద్ధి రేటు పరంగా 2022లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు నెలకొల్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా నిలిచింది. కోవిడ్‌ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ప్రోత్సాహకాల కారణంగా 2021–22లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో భారీ వృద్ధి నమోదైంది.

కోవిడ్‌కు ముందు 2018–19 చంద్రబాబు హయాంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. అయితే, 2021–22లో స్థిర ధరల ఆధారంగా వ్యవసాయ రంగంలో 11.27 శాతంతో రెండంకెల వృద్ధి నమోదు కాగా.. పారిశ్రామిక రంగంలో ఏకంగా 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. సేవా రంగంలో కూడా 2018–19 కన్నా 2021–22లో 9.73 శాతం వృద్ధి నమోదైంది. 

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 11.43 శాతం వృద్ధి 
మరోవైపు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్‌బీఐతో పాటు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదికలు ఇటీవలే వెల్లడించాయి. ఇదే 2018–19 చంద్రబాబు హయాంలో 5.36 శాతమే వృద్ధి నమోదైంది. కోవిడ్‌ సంక్షోభంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు అండగా నిలవడంవల్లే సాధారణ పరిస్థితులకు మించి రెండంకెల వృద్ధి నమోదవ్వడానికి కారణమని తేలింది.

కోవిడ్‌ కారణంగా రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాలో తగ్గుదల ఉన్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుంటుపడకుండా అవసరమైన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడంతోనే ఈ రంగాలు నిలదొక్కుకుని దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలబడింది. ఆదాయ వనరులు తగ్గినప్పటికీ కూడా ప్రజల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు’ పథకాలను నిరాటంకంగా అమలుచేసింది.

దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఆ ప్రభావం రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపైన స్పష్టంగా కనిపించింది. అలాగే, కోవి­డ్‌ ఆంక్షలున్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.

రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని చెప్పిన తేదీకి ఇవ్వడమే కాకుండా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం, రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిండం వంటి చర్యలను ప్ర­భు­త్వం పక్కాగా అమలుచేసింది. దీనివల్లే.. 2021–22లో వ్యవసాయ రంగం వృద్ధి 11.27శాతంగా నమోదైంది. అదే 2018–19లో కేవలం 3.54కు పరిమితమైంది. 

పారిశ్రామిక వృద్ధి ఇలా.. 
ఇక పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. 2018–19లో చంద్రబాబు హయాంలో 3.17 శాతమే వృద్ధి నమోదు కాగా అదే 2021–22లో 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంతో పాటు పారిశ్రామిక రాయితీలను సకాలంలో విడుదల చేసింది. 2021–22లో సాధారణ కేటగిరిలో 1,046 ఎంఎస్‌ఎంఈలకు రూ.191.10 కోట్ల  రాయితీలను విడుదల చేసింది.

ఓబీసీ కేటగిరిలో 479 ఎంఎస్‌ఎంఈలకు రూ.101.31 కోట్ల రాయితీలను విడుదల చేసింది. వైఎస్సార్‌ నవోదయం పేరుతో ఒకసారి ఎంఎస్‌ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ అమలుచేశారు. ఏకంగా 1,78,919 ఖాతాలకు సంబంధించిన రుణాల పునర్వ్య­వస్థీకరణ జరిగింది. దీంతోపాటు 2021–22లో రూ.1,762.31 కోట్ల పెట్టుబడితో 5,907 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటవ్వడంతో 37,604 మందికి ఉపాధి లభించింది. అలాగే, కోవిడ్‌ కష్టాల్లోనూ పాక్షిక ఆంక్షలు, నిబంధనలు అమలుచేయడంతో సేవా రంగంలో కూడా 2021–­22­లో 9.73 % వృద్ధి నమోదైంది. అదే 2018–­19 బాబు హయాంలో కేవలం 4.84 శాతమే.  

2021–22లో కేంద్రం విడుదల చేసిన నివేదిక మేరకు స్థిర ధరల ఆధారంగా రాష్ట్రాల జీఎస్‌డీపీల శాతం ఇలా..  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top