ఆహార పరిశ్రమలకు అంకురార్పణ

Andhra Pradesh Govt to set up establishment of food industries - Sakshi

సాక్షి, అమరావతి: ఆహార పరిశ్రమలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తొలివిడతలో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల టెండర్ల  ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైఎస్సార్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న నాలుగు యూనిట్లకు బుధవారం టెండర్లు పిలిచింది. మిగిలిన వాటికి సంక్రాంతిలోగా టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది. మార్చిలోగా పనులు ప్రారంభించి డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని, 2023 జనవరి నుంచి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

రూ.2,389 కోట్లతో 26 యూనిట్లు 
ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏటా పెరుగుతున్న ఉత్పాదకత, ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీని తీసుకొచ్చింది. దీన్లో భాగంగా పార్లమెంటు నియోజకవర్గస్థాయిలో రూ.2,389 కోట్లతో 26 సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటి నిర్వహణకు 115 కంపెనీలు ఇప్పటికే ఆసక్తి కనబరిచాయి. ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ పర్యవేక్షణలో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ద్వారా ఏర్పాటు చేస్తున్న వీటికయ్యే వ్యయంలో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

మిగిలిన మొత్తాన్ని నాబార్డుతో సహా బహుళజాతి బ్యాంకులు అందించనున్నాయి. తొలివిడతగా రూ.1,289 కోట్లతో 9 జిల్లాల్లో 11 యూనిట్లు ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైన ఈ యూనిట్లకు భూసేకరణ కూడా పూర్తయింది. వీటి కోసం ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) పద్ధతిలో కనీసం 15 ఏళ్ల పాటు లీజ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ మోడల్‌లో టెండర్లు పిలుస్తున్నారు. తొలివిడతగా రూ.233.48 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నాలుగు యూనిట్లకు ఆసక్తిగల బహుళజాతి సంస్థల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ (ఆర్‌ఎఫ్‌పీ) కోరుతూ బుధవారం టెండర్లు పిలిచారు. 

టెండర్లు పిలిచిన 4 యూనిట్లు ఇవే.. 
తొలివిడతగా నాలుగు యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో రూ.33.79 కోట్లతో 5 ఎకరాల్లో రోజుకు 114 టన్నుల సామర్థ్యంతో డ్రైడ్‌ హనీడిప్డ్‌ బనానా యూనిట్, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో రూ.24.90 కోట్లతో 7.02 ఎకరాల్లో రోజుకు రెండు టన్నుల సామర్థ్యంతో మామిడి తాండ్ర యూనిట్, పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జన్నంపేట వద్ద 9.5 ఎకరాల్లో రోజుకు 127 టన్నుల సామర్థ్యంతో రూ.82.07 కోట్లతో కోకో ప్రాసెసింగ్‌ యూనిట్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాలలో రూ.92.72 కోట్లతో 15 ఎకరాల్లో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో డీ హైడ్రేషన్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్‌ యూనిట్లకు టెండర్లు పిలిచారు. వీటిద్వారా ప్రత్యక్షంగా 500 నుంచి 600 మందికి, పరోక్షంగా 1,500 మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

మార్చికల్లా పనులకు శ్రీకారం 
పండించిన ప్రతి పంటను ప్రాసెస్‌ చేసి మార్కెట్‌లోకి తీసుకెళ్లడం ద్వారా రైతులకు అదనపు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్లకు దశలవారీగా టెండర్లు పిలిచి డిసెంబర్‌కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలివిడతలో 4 యూనిట్లకు టెండర్లు పిలిచాం. మిగిలిన యూనిట్లకు సంక్రాంతిలోగా టెండర్లు పిలవబోతున్నాం. 
– కురసాల కన్నబాబు,వ్యవసాయశాఖ మంత్రి    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top