
పనులను పరిశీలిస్తున్న వీఎంసీ కమిషనర్
పటమట (విజయవాడ తూర్పు): విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం అదనంగా మరో రూ.106 కోట్లు కేటాయించిందని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. నగర పర్యటనలో భాగంగా శుక్రవారం స్మృతివనం పనులను ఆయన పరిశీలించారు.
రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారని, ఆయన నిరంతరం ఇక్కడ జరుగుతోన్న పనులను సమీక్షిస్తూ అధికారులకు సూచనలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే స్మృతివనం పనులు 95% పూర్తయ్యాయని, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్మృతివనాన్ని, 125 అడుగుల విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని చెప్పారు. అంబేడ్కర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు వీలుగా డిజిటల్ మ్యూజియం, మినీ థియేటర్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయని, మిగిలిన అన్ని పనులూ శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.