టెక్నికల్‌ కోపరేషన్‌ ప్రాజెక్టు: ఏపీ-ఎఫ్‌ఏవో మధ్య ఒప్పందం

Agreement Between AP Govt And FAO For Technical Cooperation Project - Sakshi

ఆర్‌బీకేలకు సాంకేతిక, ఆర్థికంగా సాయం అందించనున్న ఎఫ్‌ఏవో, ఐసీఏఆర్‌

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని యునైటెడ్‌ నేషన్స్‌కు చెందిన పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) బృందం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌) ప్రతినిధులు కలిశారు. సుస్థిర వ్యవసాయ–ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడంతో పాటు రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు ఎఫ్‌ఏఓ– ఏపీల మధ్య టీసీపీ(టెక్నికల్‌ కోపరేషన్‌ ప్రాజెక్టు) ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య.. టోమియో షిచిరి, కంట్రీ డైరెక్టర్‌ (ఇండియా), పుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏఓ) యునైటెడ్‌ నేషన్స్‌  డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఏ కె సింగ్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

చదవండి: CM YS Jagan: సీఎం వైఎస్‌ జగన్‌ నూతన ఏడాది కానుక

అందరికీ ఆహార భద్రతపై అంతర్జాతీయంగా ఏఫ్‌ఏఓ కృషి చేస్తోంది. రాష్ట్రంలో ఆర్బీకేలకు సాంకేతికంగా, ఆర్ధికంగా సాయం అందించనుంది. రైతు భరోసా కేంద్రాల బలోపేతం చేసేందుకు  ఎఫ్‌ఏఓ, ఐసీఏఆర్‌ సహకరించనున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు ఎఫ్‌ఏఓ శిక్షణ అందించనుంది. ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతుల్లోనూ రైతులకు శిక్షణ అందించనుంది.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను ప్రతినిధులకు సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల వాడకం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారని.. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆర్బీకేలు వచ్చాయని సీఎం అన్నారు. అలాగే రైతులకు మద్దతు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇ– క్రాపింగ్‌ గురించి సీఎం వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయరంగంలో పెను మార్పులు వస్తున్నాయన్నారు.

కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్, ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్‌ ఎండీ జి శేఖర్‌బాబు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top