నాయకుల ఆత్మలు, బినామీలు న్యాయస్థానాలకు వస్తున్నారు

Advocate General Shriram Reported To AP High Court - Sakshi

సదుద్దేశం లేని ‘పిల్‌’లు కొట్టివేయండి

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌

విచారణ 25కి వాయిదా

సాక్షి, అమరావతి: సదుద్దేశం లేకుండా దాఖలయ్యే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ప్రాథమిక దశలోనే కొట్టి వేయాలని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ హైకోర్టుకు విన్నవించారు. ఇటీవల నాయకుల ఆత్మలు, బినామీలు ఓ పక్కా ప్రణాళికతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు అందరితో సమానంగా ప్రకటనలు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న పిటిషనర్‌ కిలారు నాగ శ్రవణ్‌ పలు కీలక అంశాలను తొక్కిపెట్టి వ్యాజ్యం దాఖలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు.

వివరాలు వెల్లడిస్తే విషయం తెలుస్తుంది: ఏజీ
► 2014–19 మధ్య కాలంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రకటనలు, మిగిలిన పత్రికలకు ఇచ్చిన ప్రకటనల వివరాల గురించి పిటిషనర్‌ మాట్లాడటం లేదు. ఆ వివరాలు ప్రస్తావించి ఉంటే అసలు విషయం తెలిసేది. అర్థ సత్యాలను మాత్రమే కోర్టు ముందుంచారు. 

► పిటిషనర్‌కు టీడీపీతో ఎంతో అనుబంధం ఉందనేది అందరికీ తెలుసు. 
► పిటిషనర్‌ తన రాజకీయ మార్గదర్శి కింజారపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి డిజిటల్‌ మహానాడు నిర్వహించారు. 

సుప్రీం తీర్పునకు విరుద్ధం: పిటిషనర్‌ న్యాయవాది
► పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషనర్‌ నాగ శ్రవణ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టుకు నివేదించారు. ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఫోటోను పెద్దగా వాడుతున్నారని, ముఖ్యమంత్రి తండ్రి ఫోటోను కూడా వాడుతున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ ప్రకటనల్లో పార్టీ రంగులను వాడుతున్నారని, సాక్షి పత్రికకు ఎక్కువ ప్రకటనలు ఇచ్చారని, సర్క్యులేషనే లేని ప్రజాశక్తి, ఆంధ్రప్రభలకు సైతం ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువ ప్రకటనలు ఇచ్చారని పేర్కొన్నారు.

అభ్యంతరాల దాఖలుకు అనుమతి..
► ఈ వ్యాజ్యం విచారణార్హతపై ప్రాథమిక అభ్యంతరాలు దాఖలు చేస్తామని ఏజీ పేర్కొనడంతో హైకోర్టు అందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  (అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే ఫీజు వాపసు ఇవ్వాల్సిందే)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top