అడ్మిషన్‌ రద్దు చేసుకుంటే ఫీజు వాపసు ఇవ్వాల్సిందే

AICTE Command For Technical Educational Institutions - Sakshi

వారంలోపే సర్టిఫికెట్లను కూడా విద్యార్థులకు ఇచ్చేయాలి

నిబంధనలు పాటించకపోతే చర్యలు

సాంకేతిక విద్యాసంస్థలకు ఏఐసీటీఈ ఆదేశం

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, తదితర సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశం పొంది వివిధ కారణాలతో అడ్మిషన్‌ను రద్దు చేసుకునే విద్యార్థులకు ఫీజులు, సర్టిఫికెట్లను వారంలోపు తిరిగి ఇచ్చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకునే విద్యార్థులతోపాటు మధ్యలో ఉపసంహరించుకునే విద్యార్థులకు కూడా ఫీజులు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇచ్చేయాలని అన్ని సాంకేతిక ఉన్నత విద్యా సంస్థలకు సూచనలు ఇచ్చింది. కోవిడ్‌–19తో తలెత్తిన అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ఇది ప్రతి విద్యా సంస్థ ప్రాథమిక బాధ్యతగా గుర్తెరగాలని పేర్కొంది. పూర్తి ఫీజు వాపసుతో సాంకేతిక కోర్సుల సీట్ల అడ్మిషన్‌ను రద్దు చేసుకోవడానికి గడువు నవంబర్‌ 10గా ఏఐసీటీఈ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరికొన్ని అంశాలను జోడిస్తూ ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఇలా..

► నవంబర్‌ 10 కంటే ముందుగా విద్యార్థి తన అడ్మిషన్‌ను ఉపసంహరించుకుంటే వసూలు చేసిన మొత్తం ఫీజులో రూ.1,000 లోపు ప్రాసెసింగ్‌ ఛార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని విద్యా సంస్థలు తిరిగి చెల్లించాలి.
► ఒకవేళ నవంబర్‌ 10 తర్వాత విద్యార్థి అడ్మిషన్‌ను వదిలేస్తే.. ఖాళీ అయ్యే ఆ సీటును నవంబర్‌ 15లోగా వేరే విద్యార్థితో భర్తీ చేసుకుంటే రూ.1,000కి మించకుండా ప్రాసెసింగ్‌ ఛార్జీలు తీసుకోవచ్చు. దీంతోపాటు విద్యార్థి ఎన్ని రోజులపాటు ఉన్నాడో ఆ మేరకు ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు (హాస్టల్‌ ఉంటేనే)ను మినహాయించుకుని తక్కిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలి. 
► నవంబర్‌ 10 తర్వాత ఖాళీగా ఉన్న సీటు నవంబర్‌ 15 వరకు భర్తీ కాకపోతే ఆ విద్యా సంస్థ సదరు విద్యార్థికి సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి చెల్లించాలి. సర్టిఫికెట్లు కూడా వెనక్కి ఇవ్వాలి.
► విద్యార్థి అడ్మిషన్‌ను వదులుకుని సంస్థ నుంచి వెళ్లిపోవాలనుకుంటే తదుపరి సెమిస్టర్లు, సంవత్సరాలకు సంబంధించిన ఫీజును అడగరాదు. 
► ప్రవేశాన్ని రద్దు చేయడం లేదా ఫీజును వాపసు చేయడంలో ఆలస్యం, ఏఐసీటీఈ మార్గదర్శకాలను పాటించకున్నా చర్యలు తప్పవు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top