
సాక్షి, విశాఖపట్నం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏయూ స్టూడెంట్ అభిషేక్‌ను పరామర్శించడానికి ఏయూ రిజిస్ట్రార్‌కు షాక్ తగిలింది. రిజిస్ట్రార్‌ను అభిషేక్ తల్లి నిలదీశారు. రిజిస్ట్రార్ కారుకి అడ్డంగా కూర్చుని అభిషేక్ తల్లిదండ్రులు నిరసన తెలిపారు. అభిషేక్ చావును చూసేందుకు వచ్చారా అంటూ అధికారులను అభిషేక్ కుటుంబ సభ్యులు కడిగి పారేశారు.
‘‘ఏయూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు యత్నించాడు. అభిషేక్‌ను ప్రొఫెసర్ తీవ్రంగా వేధించాడు. వేధింపులకు పాల్పడిన వారిని విధుల నుంచి తొలగించాలి’’ అని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అభిషేక్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇస్తేనే కదలనిస్తామంటూ అభిషేక్ తల్లిదండ్రులు తేల్చి చెప్పారు. దీంతో అభిషేక్ తల్లిదండ్రులపై ఆర్ట్స్ కాలేజీ హెచ్‌వోడీ జాలాది రవి బెదిరింపులకు దిగారు.
పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లినందుకు ఓ ప్రొఫెసర్ కక్షగట్టి, తన విద్యా సంవత్సరాన్ని నష్టపరిచారని ఆరోపిస్తూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యార్థి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన ఏయూ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
బాధితుడి కథనం ప్రకారం.. ఏయూలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న అభిõÙక్ (22).. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు రాశాడు. అప్పటికే మ్యాథ్స్–2, డీఎల్‌డీ, డీఎస్‌సీ పరీక్షలను బాగా రాశానని విద్యార్థి తెలిపాడు. నాల్గోదైన ఫిజిక్స్ పరీక్ష రాస్తుండగా.. తన జేబులోని స్మార్ట్‌ఫోన్ కింద పడిపోయింది. అది గమనించిన ఇన్విజిలేటర్ ప్రొఫెసర్ పాల్.. తాను కాపీ కొడుతున్నానని భావించి, ఫోన్ లాక్కుని తనను బయటకు పంపించారని అభిషేక్ తెలిపాడు. ‘తెలియక చేసిన తప్పు సార్, క్షమించండి.’ అని ఎంత వేడుకున్నా ప్రొఫెసర్ కనికరించలేదన్నాడు.
పరీక్ష అయిన తర్వాత సెల్‌ఫోన్ ఇచ్చేసి.. ‘నేనేంటో నీకు చూపిస్తా’ అంటూ బెదిరించారని వాపోయాడు. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో అభిõÙక్ రాసిన అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్లు చూపించారు. అంతేకాకుండా, ‘ఈ ఏడాదికి నీకింతే.. వచ్చే ఏడాది పరీక్షలు రాసుకో’ అంటూ ఇంటికి లేఖ పంపారని అభిషేక్ కన్నీటిపర్యంతమయ్యాడు.
తాను బాగా రాసిన మూడు పరీక్షలను కూడా ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి ఫెయిల్ చేయించారని, ప్రొఫెసర్ వేధింపుల వల్లే తాను విద్యా సంవత్సరం నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు అభిషేక్ తెలిపాడు.