81 శాతం భూరికార్డుల స్వచ్ఛీకరణ 

81 percent purification of land records - Sakshi

రికార్డులు అప్‌డేట్‌ అయితేనే సర్వే ప్రారంభించే అవకాశం  

అందుకే వేగంగా పూర్తిచేస్తున్న రెవెన్యూ యంత్రాంగం 

అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందశాతం పూర్తి 

సాక్షి, అమరావతి: భూముల రీసర్వే నేపథ్యంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల స్వచ్చికరణ (ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్స్‌) రాష్ట్రవ్యాప్తంగా 81 శాతం పూర్తయింది. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత వైఎస్సార్‌ జగనన్న భూరక్ష, శాశ్వత భూహక్కు పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో రికార్డుల ప్రక్షాళన అత్యంత కీలకంగా మారింది.

రీసర్వే ప్రారంభించాలంటే రికార్డులను అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి. వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లను ఆర్‌ఎస్‌ఆర్‌తో పోల్చి చూడడం, అడంగల్‌లో పట్టాదారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం, పట్టాదారు, అనుభవదారుల వివరాల కరెక్షన్, అప్‌డేషన్, పట్టాదారు డేటాబేస్‌ను అప్‌డేట్‌ చేయడం వంటివన్నీ కచ్చితంగా పూర్తిచేయాల్సి ఉంది.

రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ పూర్తిచేసిన తర్వాతే సర్వే బృందాలు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే రికార్డుల స్వచ్చికరణపై ప్రత్యేకదృష్టి సారించి చేస్తున్నారు. 26 జిల్లాల్లోని 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇప్పటివరకు 14,235 గ్రామాల్లో (81 శాతం) పూర్తయింది.  

అల్లూరి జిల్లాలో 25 శాతం మాత్రమే
అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణను పూర్తిచేశారు. అనంతపురం జిల్లాలో 504 గ్రామాలకు 504, కర్నూలు జిల్లాలో 472కి 472, నంద్యాల జిల్లాలో 441కి 441 గ్రామాల్లో స్వచ్చికరణ పూర్తయింది. చిత్తూరు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో 99 శాతం స్వచ్చికరణ పూర్తయింది. ఈ జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో మాత్రమే ఇంకా పూర్తికావాల్సి ఉంది.

సత్యసాయి, తూర్పుగోదావరి, ప శ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో 98 శాతం స్వచ్ఛీకరణ పూర్తయింది. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 25 శాతం స్వచ్ఛీకరణనే పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 44 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61 శాతం స్వచ్చికరణ పూర్తయింది. రెండునెలల్లో అన్ని జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణ పూర్తిచేసేందుకు రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించి పనిచేస్తోంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top