5 సంవత్సరాల్లో గ్రామాల్లో పరిశుభ్రత, మంచినీటికి 6,140 కోట్లు

6140 crore for sanitation and fresh water in villages in 5 years - Sakshi

15వ ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం వీటికే

ఇతర కార్యక్రమాలు, పథకాల ద్వారా అదనంగా మరికొన్ని నిధులు

దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వసతుల కల్పన

ప్రతి పంచాయతీకి వేర్వేరుగా ఐదేళ్ల ప్రణాళిక

అమలుకు 15 మందితో కమిటీ.. మహిళలు, అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం

ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై పంచాయతీరాజ్‌ శాఖ ముసాయిదా సిద్ధం 

సాక్షి, అమరావతి: గ్రామాల్లో మెరుగైన పరిశుభ్రత, మంచినీటి సరఫరా సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో భారీగా నిధులు వెచ్చించనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.6,140 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. అదనంగా ఇతర కార్యక్రమాలు, పథకాల నిధులను వీటికి జతచేసి ఈ అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిబంధనల్లో మార్పులు తేనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. 

60 శాతం నిధులు..
స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఏటా కేటాయించే నిధుల్లో 60 శాతం పరిశుభ్రత, మంచినీటి అవసరాలకు ఖర్చు చేయాలని ముసాయిదాలో పంచాయతీరాజ్‌ శాఖ పేర్కొంది. ప్రతి గ్రామంలో ఏడాది పొడవునా తాగునీటి లభ్యత సౌకర్యాల కల్పన, రోజూ ప్రతి ఇంటికీ నీటి సరఫరాకు మౌలిక వసతుల ఏర్పాటు, పర్యవేక్షణ, రహదారులు, ఇతర ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, క్రమ విధానంలో చెత్త సేకరణ తదితరాల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు.

ప్రతి గ్రామానికి ఐదేళ్ల ప్రణాళిక..
గ్రామంలో పరిశుభ్రత, మంచినీటి సరఫరా సౌకర్యాల కోసం ప్రతి పంచాయతీకి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వనరులు, అదనపు సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందిస్తారు. తుపాన్లు లాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. గ్రామసభలో ప్రణాళికపై చర్చించి తుది ఆమోదం తీసుకోవాలి. ప్రణాళికల అమలుకు సర్పంచ్‌ నేతృత్వంలో 15 మంది సభ్యులతో  కమిటీని నియమించుకోవచ్చు. కమిటీలో మహిళలు, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top