ప్రతి జిల్లాలో 30 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు

30 vaccination centers in each district of AP - Sakshi

ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి నాని

వ్యాక్సిన్‌ను భద్రపరిచేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌ సెంటర్లు సిద్ధం

ఏలూరు టౌన్‌: ఈనెల 16 నుంచి రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ..  ప్రతీ జిల్లాలో 30 వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉంటాయనీ, వాటిలో ప్రతి నియోజకవర్గంలో ఒక కేంద్రం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ భద్రపరిచేందుకు 17 కోల్డ్‌ స్టోరేజీ సెంటర్లు సిద్ధం చేశామని, ఇక్కడ 24 గంటలూ విద్యుత్‌ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. వ్యాక్సినేషన్‌ కోసం 17 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు.

తొలి దశ వ్యాక్సినేషన్‌లో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. జిల్లా కేంద్రాల్లో నిల్వ చేస్తోన్న వ్యాక్సిన్‌ను ఆయా కేంద్రాలకు ఉదయాన్నే ప్రత్యేక వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో తహసిల్దార్, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతీ రోజూ టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి వ్యాక్సినేషన్‌ నివేదిక అందేలా చర్యలు చేపట్టామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top