మా జీవితాల్లో సీఎం జగన్‌ వెలుగులు నింపారు

1998 DSC Candidates Thanks To CM YS Jagan Mohan Reddy - Sakshi

1998 డీఎస్సీ అభ్యర్థుల హర్షం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వారి 23 ఏళ్ల ఎదురు చూపులు ఫలించనున్నాయి. వారంతా డీఎస్సీలో అర్హత సాధించినా.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇంతవరకూ కొలువులు దక్కలేదు. అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పచ్చజెండా ఊపారు. దీంతో 1998 డీఎస్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటూ తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. 

పాదయాత్రలో మొరపెట్టుకున్న అభ్యర్థులు 
1998లో అప్పటి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి అర్హుల జాబితా సిద్ధం చేసింది. వారిలో కొంతమందికి మాత్రమే ఉద్యోగాలిచ్చి మరికొంతమంది భవిష్యత్తును గాలికొదిలేసింది. ఆ తరువాత 2000, 2001, 2002, 2003, 2006, 2008, 2012, 2016, 2018 సంవత్సరాల్లో సైతం డీఎస్సీలు నిర్వహించి వారికి ఉద్యోగాలిచ్చినా 1998లో అర్హత సాధించిన వారి భవితను త్రిశంకు స్వర్గంలో ఉంచారు. అప్పటి నుంచి వారు అనేక పోరాటాలు చేసినా వారి గోడును ఆలకించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని పాదయాత్రలో 1998 డీఎస్సీ అర్హులు కలిసి మొరపెట్టుకున్నారు. తాను అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తానని జగన్‌ అభయహస్తం ఇచ్చారు. 

మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు  
ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేయగా.. సుప్రీంకోర్టులోవేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ అడ్డంకిగా మారింది. సాంకేతికంగా ఏర్పడిన ఇబ్బందిని అనంతర కాలంలో అధిగమించడంతో ఇప్పుడు సీఎం జగన్‌ తన హామీని నెరవేర్చడానికి అనుకూల పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి కూడా ఉద్యోగాలిచ్చే ఫైలులో కదలికలు వచ్చాయి. ప్రస్తుతం 1998 డీఎస్సీ అర్హులైన అభ్యర్థులు జిల్లాలో సుమారు 450 మంది ఉండగా వారిలో మెరిట్‌ ప్రాతిపదికన అప్పటి డీఎస్సీలో ప్రకటించిన మేరకు సమారు 275 మందికి ఉద్యోగాలొచ్చే అవకాశం కలిగింది. దీనిపై అభ్యర్థులు స్పందిస్తూ జగనన్న నిజంగానే మాటతప్పని, మడమ తిప్పని నాయకుడని మరోసారి నిరూపించుకున్నా రని కృతజ్ఞతలు తెలిపారు.    

చాలీచాలని జీతాలతో నెట్టుకొచ్చాం 
ఇంతవరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలీచాలని జీతాలతో దుర్భరంగా నెట్టుకొస్తున్నాం. మా తరువాత ఎన్నో డీఎస్సీలు జరిగి మాకంటే జూనియర్లు ఉద్యోగాల్లో స్థిరపడగా మేం మాత్రం ఉద్యోగం కోసం పోరాటాలు చేస్తూనే ఉండాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌ మా ఆవేదనను అర్థం చేసుకున్నారు. మాకు ఉద్యోగాలివ్వడానికి ముందుకు రావడం నిజంగా మా అదృష్టం. ముఖ్యమంత్రి పెద్ద మనసుకు కృతజ్ఞులమై ఉంటాం.  
– రామబ్రహ్మ పతంజలి, 1998 డీఎస్సీ అభ్యర్థి 

23 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం 
23 ఏళ్లుగా ఎంతో వేదనాభరిత జీవితం అనుభవించాం. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా సమస్యకు పరిష్కారం లభించలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను పాదయాత్రలో కలిసి మా సమస్య చెప్పుకున్నాం. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన అన్ని వర్గాలకూ న్యాయం చేశారు. మాకూ న్యాయం చేస్తారనే ధీమాతోనే ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. దీనిని మేము పండుగలా చేసుకుంటాం. ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలుపుతూ విజయోత్సవ సభను జిల్లాస్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. 
– వై.సుబ్బారాయుడు, 1998 డీఎస్సీ అర్హుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు 

ముఖ్యమంత్రి ఆశయాలను కొనసాగిస్తాం 
బీఎస్సీ, బీఈడీ అర్హత ఉంది. డీఎస్సీకి అర్హులమయ్యాం. కానీ ఉద్యోగం మాత్రం కలగానే మిగిలిపోయింది. అర్హతకు తగిన ఉద్యోగం కాకపోయినా కుటుంబ పోషణకు తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేట్‌ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తున్నాం. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని జగన్‌ చేశారు. మా ఆవేదనను అర్థం చేసుకుని మాకు ఉద్యోగాలివ్వడానికి పచ్చజెండా ఊపిన ముఖ్యమంత్రిని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తాం. 
– పి.బెనర్జీ, 1998 డీఎస్సీ అర్హుల సంఘం జిల్లా అధ్యక్షుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top