విభిన్న ప్రతిభావంతులకు 1,750 మోటార్‌ వాహనాలు | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతులకు 1,750 మోటార్‌ వాహనాలు

Published Tue, Nov 8 2022 5:12 AM

1750 motor vehicles for various talents of Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం 1,750 మూడు చక్రాల మోటారు వాహనాలను ఉచితంగా (పూర్తి సబ్సిడీతో) అందించనుంది. అసెంబ్లీ నియోజకవర్గానికి పది చొప్పున వాహనాలను కేటాయించారు.  ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల రోజైన డిసెంబర్‌ 3న వీటి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.

విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిబంధనలను సరళతరం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం రెండు విడతలుగా 1,532 వాహనాలను మాత్రమే పంపిణీ చేయగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒకే విడతలో అంతకు మించిన సంఖ్యలో వాహనాలను అందిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం 80 శాతం వైకల్యం ఉంటేనే వాహనాన్ని ఇవ్వగా, జగన్‌ ప్రభుత్వం దానిని 70 శాతానికి తగ్గించింది. వయోపరిమితిలో కూడా సడలింపులు ఇచ్చారు. తద్వారా మరింతమందికి లబ్ధి చేకూరనుంది. వాహనాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు 5,743 దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తులను పరిశీలించి అర్హులను ఎంపిక చేయడానికి జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన కమిటీలను నియమించారు. ఈ కమిటీలో విభిన్న ప్రతిభావంతుల విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు ఆఫీసర్, ఎస్సీ, ఎస్టీ, మహిళా శిశు సంక్షేమ, రవాణా శాఖల జిల్లా అధికారులు, ఎముకల వైద్య నిపుణులు (సర్జన్‌), ఇతర అధికారులు ఉంటారు.  

ఇవీ నిబంధనలు 
► వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి 
► లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్‌ లైసెన్సు పొంది ఉండాలి 
► గతంలో ఎప్పుడూ ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు 
► గతంలో దరఖాస్తు చేసినప్పటికీ వాహనాలు మంజూరుకాకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు 
► జిల్లా మెడికల్‌ బోర్డు ఇచ్చిన సదరం ధ్రువపత్రం, ఆధార్‌ కార్డు, వృత్తిదారులు అయితే ఎస్‌ఎస్‌సీ ధ్రువపత్రం, విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ విద్యార్హతల పత్రాలు ఉండాలి 
► ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజులో పూర్తి ఫొటో 
► వీటన్నిటిని ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాలి. 

వైకల్యం శాతం తగ్గింపు.. వయోపరిమితి పెంపు 
► ఎంఏ కుమార్‌ రాజా, ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ విభిన్న ప్రతిభావంతుల, వయో వృద్ధుల సహాయ సంస్థ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు అండగా నిలుస్తున్నారు. వైకల్యం శాతం తగ్గింపు, వయో పరిమితి పెంపు వంటి అవకాశాలతో విభిన్న ప్రతిభావంతులకు మేలు చేయడంలో సీఎం జగన్‌ పెద్ద మనస్సును చాటుకుంటున్నారు.

గతంలో 80 శాతం పైగా వైకల్యం ఉన్నవారే అర్హులు కాగా, ఇప్పుడు 70 శాతానికి తగ్గించాం. గతంలో 18 నుంచి 40 ఏళ్ల వయో పరిమితి నిబంధన ఉంటే ఇప్పుడు 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అర్హులుగా అవకాశం ఇచ్చారు. అర్హులకు ఒక్కొక్కరికి సుమారు రూ.92 వేల ఖరీదైన మోటారు వాహనం ఉచితంగా అందిస్తాం.   

Advertisement
Advertisement