చిన్నారికి పునర్జన్మ.. పద్మావతి హృదయాలయం అరుదైన చికిత్స

13 Months Old Baby Heart Was Transplanted At Sri Padmavathi Hrudayalaya - Sakshi

చిన్నారికి పునర్జన్మ ప్రసాదించిన శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం 

నెల రోజుల్లో విజయవంతంగా రెండో గుండె మార్పిడి శస్త్ర చికిత్స 

ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా..

తిరుపతి (తుడా): ఏడాది బిడ్డకు గుండె మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదించింది తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (చిన్న పిల్లల గుండె ఆస్పత్రి). గత నెలలో 15 సంవత్సరాల బాలుడికి గుండె మార్పిడి చేసిన ఇక్కడి వైద్యులు నెల రోజుల వ్యవధిలోనే 13 నెలల పసిబిడ్డకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 

వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల పాప అనారోగ్యం బారిన పడగా.. తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో బిడ్డను చూపించారు. పాపకు గుండె మార్చాల్సి ఉందని, తిరుపతిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఆ పాపను హృదయాలయంలో చేర్చగా.. పాపకు సరిపోయే గుండె కోసం వైద్యులు జీవన్‌దాన్‌లో రిజిస్టర్‌ చేశారు. అప్పటినుంచి ఆస్పత్రికి తీసుకుని వచ్చి అడ్మిట్‌ చేశారు. ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆ బిడ్డకు వైద్యం చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు.

కాగా, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో రెండేళ్ల బాలుడికి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు సమాచారం అందటంతో ఏపీ జీవన్‌దాన్‌ సంస్థ, చిన్నపిల్లల గుండె చికిత్సల నిపుణులు డాక్టర్‌ గణపతి బృందాన్ని డాక్టర్‌ శ్రీనాథరెడ్డి సమన్వయం చేయించారు. టీటీడీ సహకారంతో అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని వైద్య బృందం ఆదివారం రాత్రికే చెన్నై చేరుకుంది. గ్రీన్‌ చానల్‌ అవసరం లేకుండా 2గంటల 15 నిమిషాల్లో గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గుండె చేరుకోవడంతో డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్‌ గణపతి నేతృత్వంలోని బృందం గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.

ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స 
రూ.30 లక్షలు ఖర్చయ్యే గుండె మార్పిడి శస్త్ర చికిత్సను టీటీడీ ప్రాణదానం, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా పూర్తిగా ఉచితంగా చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న వైద్యుల బృందం కృషి అభినందనీయమని కొనియాడారు.  

3 నెలల జార్ఖండ్‌ చిన్నారికి శస్త్ర చికిత్స  
జార్ఖండ్‌ రాజధాని రాంచీ ప్రాంతానికి చెందిన లుక్సార్‌ పరీ్వన్‌ (మూడు నెలలు)కు శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో ఇటీవల గుండె చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం కోలుకున్న ఆ చిన్నారిని డిశ్చార్జ్‌ చేశారు. కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో చిన్నారి తల్లి పరీ్వన్‌ ఇటీవల వేలూరులోని సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ బిడ్డకు గుండె శస్త్ర చికిత్స అవసరమని నిర్ధారించి వైద్యులు తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఆ పసికందును ఆస్పత్రిలో చేర్చుకున్న పద్మావతి వైద్యులు 15 రోజుల క్రితం గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేశారు. బిడ్డ కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి సమక్షంలో సోమవారం డిశ్చార్జ్‌ చేశారు. తన బిడ్డకు పునర్జన్మనిచి్చన వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని పర్వీన్‌ సంతోషం వ్యక్తం చేశారు. లక్షలతో కూడుకున్న వైద్యాన్ని ప్రధానమంత్రి ఆరోగ్య బీమా కార్డు ద్వారా పూర్తి ఉచితంగా అందించి తన కుటుంబాన్ని నిలబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు.  

అవయవ దానానికి ముందుకు రావాలి 
ఆంధ్రప్రదేశ్‌ జీవన్‌దాన్‌ ద్వారా గుండె, కాలేయం, కిడ్నీ మా­ర్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. పలువురి ప్రాణాలను కాపాడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరూ జీవన్‌దాన్‌ కింద రిజి్రస్టేషన్‌ చేసుకుని అవయవదానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.  
– డాక్టర్‌ కె.రాంబాబు, జీవన్‌దాన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top