గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.. సర్పంచు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమయ్యారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన స్వతంత్ర గుర్తుల నుంచే అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన స్వేచ్ఛా గుర్తుల జాబితాను ప్రత్యేకంగా ప్రకటించింది. 2026 ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం సర్పంచు అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు.
సర్పంచు అభ్యర్థులకు సంబంధించిన
గుర్తులు ఇవే..:
మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు–సాసర్, క్యారెట్, తాళం–చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపండ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా వంటి గుర్తులు ఉన్నాయి. అలాగే వార్డు సభ్యుల అభ్యర్థులకు ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూలు, ఇసీ్త్ర పెట్టె, పోస్టుడబ్బా, గ్యాస్ పొయ్యి, బీరువా, ఐస్‌క్రీమ్, కెటిల్, కట్టింగ్ ఫ్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు వంటి గుర్తులు కేటాయించే జాబితా ఉంది. చివరన నోటా గుర్తుకూడా ఉంటుంది.
అభ్యర్థి కోరుకున్న గుర్తు వస్తుందా?..
ఎన్నికల గుర్తుల కేటాయింపులో అభ్యర్థి ఇష్టానికి ప్రాధాన్యం ఉండదు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారి సిద్ధం చేస్తారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల పేర్లను అక్షర క్రమంలో అమర్చి, ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తుల జాబితా నుంచి వరుస క్రమంలో గుర్తులు కేటాయిస్తారు. కేటాయించిన గుర్తును అభ్యర్థికి లేదా ఎన్నికల ఏజెంట్‌కు తెలియజేసి, ఆ గుర్తు నమూనాను కూడా అందిస్తారు. సర్పంచ్ పదవికి ఒక గుర్తుల జాబితా, వార్డు సభ్యుల ఎన్నికలకు మరో జాబితా ఉంటుంది.
గుర్తుల కేటాయింపు ఇలా..
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత రిటర్నింగ్ అధికారి పోటీలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను తయారు చేస్తారు. ఈ జాబితాను తెలుగులో అక్షరక్రమం ప్రకారం రూపొందించి, సంబంధిత కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం ప్రకటించిన స్వేచ్ఛా గుర్తుల జాబితా నుంచి అభ్యర్థుల వరుస క్రమం ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక గ్రామంలో సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉంటే, అక్షరక్రమంలో మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి మొదటి గుర్తు, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి రెండో గుర్తు.. ఈ విధంగా వరుసగా గుర్తులు కేటాయిస్తారు. వార్డు సభ్యుల విషయంలోనూ ఇదే విధానం పాటిస్తూ ప్రతి వార్డుకు విడిగా గుర్తులు కేటాయిస్తారు.
అభ్యర్థుల పేర్ల అక్షర క్రమంలో నిబంధనలు..
అభ్యర్థుల పేర్లను వరుసలో పెట్టేటప్పుడు కేవలం ఇనిషియల్స్ (పేరులోని మొదటి అక్షరాలు) ఆధారంగా క్రమం నిర్ణయించరు. అభ్యర్థి పేరులోని మొదటి అక్షరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. పేరుకు ముందు ఉన్న ఇంగ్లీష్ ఇనిషియల్స్ను పరిగణనలోకి తీసుకోరు. ఇద్దరు అభ్యర్థులకు ఒకే పేరు ఉంటే ఇనిషియల్స్, ఇంటిపేర్లు లేదా ఇతర వివరాల ఆధారంగా నిబంధనల ప్రకారం వారి క్రమాన్ని నిర్ణయిస్తారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమవుదాం..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు అనేది ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదు.. అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి, ఓటరు తన అభ్యర్థిని గుర్తించడానికి ఎంతో ప్రాధాన్యమైన అంశం. గుర్తు ఏదైనా కావచ్చు..ఓటు హక్కు మాత్రం ఎంతో విలువైనది. ‘ఎన్నికలపై అవగాహన పెంచుకుందాం.. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం’ అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
బుట్ట నుంచి బ్యాట్ వరకు గుర్తుల కేటాయింపు
సర్పంచు అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులు
అభ్యర్థుల పేర్లలో అక్షర క్రమం ప్రాతిపదికన కేటాయింపు
నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే అభ్యర్థుల తుది జాబితా
ఓటర్లూ ‘గుర్తు’ంచుకోండి.. అసెంబ్లీ,
పార్లమెంట్ ఎన్నికల తరహాలో గ్రామ
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు. సర్పంచ్, వార్డు సభ్యుల
అభ్యర్థులకు ఏయే ఎన్నికల గుర్తులు కేటాయిస్తారనే ఆసక్తి గ్రామాల్లో నెలకొంది. ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశమైన ఎన్నికల గుర్తుల కేటాయింపుపై అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ అనేక సందేహాలు ఉన్నాయి. అసలు ఎన్నికల గుర్తులు ఎన్ని ఉంటాయి? సర్పంచ్ అభ్యర్థులకు ఎలాంటి గుర్తులు కేటాయిస్తారు? వార్డు సభ్యులకు
ఏ గుర్తులు ఉంటాయి? అభ్యర్థుల పేర్లను
ఏ ప్రాతిపదికన వరుసలో పెడతారు? అనే విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.
– అనంతపురం ఎడ్యుకేషన్:


