అనంతపురం నగరానికి చెందిన విజయలక్ష్మి గత నెల 29న ప్రసవం కోసం కమలానగర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో చేసేదిలేక విజయలక్ష్మి కుటుంబీకులు సరే అన్నారు. అర గంటలోనే సిజేరియన్ చేసిన డాక్టర్లు బిడ్డను బయటకు తీశారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి రూ.48 వేల బిల్లు చేసి ఇంటికి పంపారు. ఇక్కడే కాదు.. జిల్లాలోని చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇదే తీరు. సహజ కాన్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ చాలా ఆస్పత్రుల నిర్వాహకులు శస్త్రచికిత్సలకే సిఫార్సు చేస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
అనంతపురం: వైద్యో నారాయణ అనే పదానికి కళంకం తెచ్చేలా కొందరు వైద్యులు వ్యవహరిస్తున్నారు. తల్లుల కడుపులకు కోతలు పెడుతూ కాసులు వెనకేసుకుంటున్నారు. కడుపు కోసి బిడ్డను బయటకు తీయడం (సిజేరియన్) నేడు మామూలు విషయంగా మారిపోయింది. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో సింహభాగం సాధారణ ప్రసవాలు చేస్తుండగా.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే మొత్తం కాన్పుల్లో 30.27 శాతం సిజేరియన్లు ఉంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం ఏకంగా 61.04 శాతం ఉండడం గమనార్హం.
భయపెడుతూ..
ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చని, శస్త్రచికిత్స తరువాత కూడా తల్లీబిడ్డా కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి రావడం తమ గల్లాపెట్టెలను మరింతగా నింపేస్తుందని ఆసుపత్రుల నిర్వాహకులు లెక్కలేసుకుంటున్నారు. సాధారణ ప్రసవమైతే ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రసవ వేదన భరించలేరని ఇలా రకరకాలుగా భయపెడుతూ కోతల కాన్పులకే గర్భిణులను, వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తున్నారు.
ముహూర్తాల పేరిట కొందరు..
తెలిసీ తెలియక కొంత మంది కావాలనే ఆపరేషన్లను ఎంచుకుంటున్నారు. మంచి ఘడియల్లో పుట్టిన పిల్లలు భవిష్యత్తులో గొప్పవారు అవుతారని ఆశపడే వారు నిర్ణీత ముహూర్తంలోనే ప్రసవం చేయాలని డాక్టర్లను కోరుతున్నారు. పైవేట్ ఆస్పుత్రుల ధనదాహం, ప్రజల అవగాహన లేమి వెరసి సిజేరియన్లు అధికమై తల్లీబిడ్డల శ్రేయస్సుకు ప్రమాదకరంగా మారుతున్నాయి.
వేలల్లోనే వసూలు..
సిజేరియన్ అయ్యాక కోలుకునేందుకు కొంతకాలం పడుతుంది. ఒక వేళ కుట్లు వేసిన చోట ఇన్‌ఫెక్షన్ సోకితే మరింత సమయం అవసరం. ఈ క్రమంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక సిజేరియన్‌కు రూ. 36 వేల నుంచి రూ. 75 వేల దాకా వసూలు చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం ఇచ్చే మొత్తానికి అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
మూడో స్థానంలో జిల్లా...
సిజేరియన్లు అధికంగా జరుగుతున్న జిల్లాల్లో రాష్ట్రంలోనే అనంతపురం మూడో స్థానంలో ఉంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తరచూ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తూ కాలయాపన చేయడం తప్ప క్షేత్రస్థాయిలో చర్యలు లేవనే విమర్శలున్నాయి.
సిజేరియన్లతో వచ్చే సమస్యలివే..
వివిధ రకాల అనారోగ్య సమస్యల వల్ల 15 శాతం మందికి సిజేరియన్లు అవసరమవుతాయి. కావాలనే సిజేరియన్ చేస్తే మాత్రం తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి.
సిజేరియన్ వల్ల తల్లికి ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
అనస్థీషియా (మత్తు మందు) రియాక్షన్ ఇచ్చే ప్రమాదమూ లేకపోలేదు.
రెండో ప్రెగ్నెన్సీ సమయంలో తల్లీబిడ్డకు ఇబ్బందులు తలెత్తుతాయి.
గాయం మానడానికి ఎక్కువ రోజులు పడుతుంది.
ఎక్కువగా రక్తస్రావం జరిగి కోలుకోవడానికి కూడా చాలా సమయం తీసుకుంటుంది.
అనవసరంగా ఆపరేషన్లు చేస్తే చర్యలు..
నిబంధనలు ఉల్లంఘించి సిజేరియన్లు చేసిన ఆస్పత్రులపై చర్యలు తప్పవు. అధిక సిజేరియన్లు చేసిన ఆసుపత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తాం. ఎక్కువ డబ్బు వసూలు చేసినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో డబ్బు వసూలు చేస్తే తప్పనిసరిగా అనుమతి రద్దు చేస్తాం.
– డాక్టర్ ఈబీ దేవి, డీఎంహెచ్‌ఓ


