మరింత పురోగతి సాధిస్తాం | - | Sakshi
Sakshi News home page

మరింత పురోగతి సాధిస్తాం

Feb 27 2026 7:30 AM | Updated on Feb 27 2026 7:30 AM

మరింత పురోగతి సాధిస్తాం

మరింత పురోగతి సాధిస్తాం

ఆర్థిక, ప్రణాళిక సీఎస్‌కు

తెలిపిన కలెక్టర్‌ ఆనంద్‌

అనంతపురం అర్బన్‌: కీ పర్ఫార్మెన్స్‌ ఇండికేటర్లలో మరింత పురోగతి సాధించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌కు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ తెలిపారు. ముఖ్య కార్యదర్శి గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు సీపీఓ అశోక్‌కుమార్‌, కళ్యాణదుర్గం ఆర్‌డీఓ వసంతబాబు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్‌, మల్లికార్జునుడు, పద్మావతి, నగర పాలక సంస్థ కమిషనర్‌ జశ్వంత్‌రావు, ఈఈ షాకీర్‌ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల గురించి ముఖ్య కార్యదర్శికి కలెక్టర్‌ ఈ సందర్భంగా వివరించారు. స్వర్ణాంధ్ర, జీరో పావర్టీ పీ–4 ప్రోగ్రామ్‌, కీ పర్ఫార్మెన్స్‌ ఇండికేటర్లలో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కీ పర్ఫార్మెన్స్‌పై ప్రతి నెలా సమీక్షిస్తున్నామన్నారు. ఏ అంశాల్లో వెనుకబడ్డారనే విషయాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ పురోగతి సాధించేలా మార్గనిర్దేశనం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో విజన్‌ ప్లాన్‌ యూనిట్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

28లోపు జీవన ధ్రువీకరణ పత్రాలు సమర్పించండి

పెన్షనర్లకు ఖజానా డీడీ సూచన

అనంతపురం అర్బన్‌: జిల్లాలోని పెన్షన్‌దారులు తమ జీవన ధ్రువీకరణ పత్రాలను (లైఫ్‌ సర్టిఫికెట్‌) ఈనెల 28వ తేదీలోపు సమర్పించాలని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రమణయ్య తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. 2026 సంవత్సరానికి పెన్షన్‌దారులు తమ జీవన ధ్రువీకరణను నిర్దేశించిన తేదీలోపు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇప్పటి వరకు జిల్లాలో 15,167 మంది జీవన ధ్రువీకరణ చేయించుకున్నారన్నారు. అనారోగ్యం, నిస్సహాయ స్థితిలో ఉండి ఇప్పటికీ చేయించుకోని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఖజానా కార్యాలయ అధికారులను ఈనెల 28వ తేదీలోపు సంప్రదిస్తే జీవన ధ్రువీకరణ పూర్తికి చర్యలు తీసుకుంటామన్నారు. గడువులోపు చేసుకోని పక్షంలో భవిష్యత్‌ పెన్షన్‌ చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. ‘జీవన్‌ ప్రమాణ్‌’ పోర్టల్‌ ద్వారా కూడా జీవన ధ్రువీకరణ చేయించుకునే సౌకర్యం ఉందని తెలిపారు.

జిల్లా రిజిస్ట్రార్‌గా శ్రీనివాసులు

అనంతపురం టౌన్‌: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌(డీఆర్‌)గా శ్రీనివాసులును నియమిస్తూ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ అంబేడ్కర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఐజీ విజయలక్ష్మీ తెలిపారు. 2022 బ్యాచ్‌కు చెందిన గ్రూప్‌–1, 2 ఉద్యోగులపై వస్తున్న ఆరోపణలపై ఇటీవలే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు డీఆర్‌ భార్గవ్‌ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ ఆడిట్‌ విభాగంలో డీఆర్‌గా పని చేస్తున్న శ్రీనివాసులును జిల్లా ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నారు.

ఏపీఆర్‌సెట్‌లో సత్తా

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రీసర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఆర్‌సెట్‌) పరీక్షలో అనంత పురం రూరల్‌ మండలం పిల్లిగుండ్లకాలనీకి చెందిన సాకే సాయిసుష్మా సత్తా చాటింది. రాష్ట్రంలో మొదటిర్యాంకు సాధించి ప్రశంసలు అందుకుంటోంది. గత నవంబరు 6న జరిగిన ఈ పరీక్ష ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. సాకే సాయిసుష్మా ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 151.75 మార్కులతో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈమె స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో సాయి సుష్మా అడ్వాన్స్డ్‌ ఇంగ్లిష్‌ డిగ్రీ చేసింది. తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పట్టా పొందింది.అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ షిప్‌లో నాలుగుసార్లు నెట్‌, ఏపీసెట్‌లో ఉత్తీర్ణత సాధించింది. సాయి సుష్మా తండ్రి నారాయణస్వామి న్యాయవాదిగా పని చేస్తున్నారు. తల్లి ఉషాకుమారి అనంతపురం నగరం కొత్తూరు ప్రభుత్వ బాలుర ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంగ్లిష్‌ అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. మొదటిర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని సాయిసుష్మా పేర్కొన్నారు. ఆమెను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement