ఎద్దుల బండి బోల్తా.. రైతు మృతి
కళ్యాణదుర్గం రూరల్: ఎద్దుల బండి బోల్తాపడిన ఘటనలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరు మండలం మర్రిమాకులపల్లికి చెందిన రైతు రామాంజనేయులు (58) శనివారం ఎద్దుల బండి కట్టుకుని పొలానికి బయలుదేరాడు. తోటలోకి వెళుతుండగా చక్రం గొయ్యిలో పడి బండి బోల్తాపడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య జయమ్మ, నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బంగారు నగల అపహరణ
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం పట్టపగలే ప్రయాణికురాలు సంధ్యారాణి వద్ద నుంచి విలువైన బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. అనంతపురం నివాసి సంధ్యారాణి ఆర్టీసీ బస్సులో గుత్తి బస్టాండ్‌కు చేరుకున్నారు. చిక్కేపల్లికి వెళ్లేందుకు మరో బస్సు ఎక్కిన తర్వాత తన బ్యాగ్‌ను పరిశీలించుకున్నారు. అందులో ఉంచిన చైన్, ఉంగరం, కమ్మలు మొత్తం ఆరు తులాల బరువున్న బంగారు నగలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేసినా ఫలితం లేకపోయింది. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


