వైభవంగా గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఉరవకొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, మఠం అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో కంకణధారణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గవిమఠం ఆవరణ నుంచి పవిత్ర గంగాజలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం కంకణ మండపంలోని కుండల్లో మట్టి వేసి నవధాన్యాలు ఉంచారు. బ్రహ్మోత్సవాలు ముగిసే లోపు మట్టికుండల్లో ధాన్యాలు బాగా పండితే ఈ ఏ డాది పంటలు చేతికొచ్చి రైతులు సుభిక్షంగా ఉంటారని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో గవిమఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు, వీరశైవ సంఘం నాయకులు నిరంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘సమర శంఖం’
విజయవంతం చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) చేపడుతున్న దశలవారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 25న విజయవాడలో తలపెట్టిన ‘సమర శంఖం’ను విజయవంతం చేయాలని జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నగరంలో ‘సమర శంఖం’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పలు హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఇప్పటిదాకా కనీసం కమిటీ కూడా వేయకపోవడం దారుణమన్నారు. మధ్యంతర భృతి కూడా ప్రకటించకపోవడం సమంజసం కాదన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మెమో 57 మేరకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలన్నారు. పెండింగ్ డీఏలు వెంటనే ప్రకటించాలన్నారు. పదవీ విరమణ పొందే ఉద్యోగులకు మరుసటి రోజే సౌలభ్యాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నగర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, నాయకులు ఫణి భూషణ్, పెద్దన్న, వన్నూరప్ప, విరుపాక్షి గౌడ్, జయరాం నాయుడు, నాగభూషణం నాయుడు, నారాయణస్వామి, నాగభూషణ, రాజన్న, రామకృష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
ఆత్మకూరు: సమస్యాత్మక గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. శనివారం ఆత్మకూరు పీఎస్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాల సరిశుభ్రత, సీసీ కెమెరాల పనితీరు, లాకప్ గది, భద్రతా ప్రమాణాలతో పాటు పలు రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ వివాదాస్పద అంశాలు ముందుగానే గుర్తించి సమన్వయ సమావేశాల ద్వారా పరిష్కరించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ అమలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక డ్రైవ్ చేపట్టి డ్రంకెన్ డ్రైవ్ నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను కోర్టు ఆదేశాల మేరకు వేలం వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా గవిమఠం బ్రహ్మోత్సవాలు
వైభవంగా గవిమఠం బ్రహ్మోత్సవాలు


