ప్రభుత్వం వల్లే ఎఫ్‌సీఆర్‌ఏ ఆగిపోయింది
● ఆర్డీటీ సేవలు కొనసాగించాలి
● మాజీ ఎంపీ తలారి రంగయ్య
బ్రహ్మసముద్రం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదరికాన్ని పారదోలేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డీటీ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కాకుండా ఆగిపోయిందని వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య దుయ్యబట్టారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించాలని, త్రిబుల్ ఇంజిన్ సర్కార్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శనివారం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి వద్ద ఉన్న తిమ్మప్ప కొండకు వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి రంగయ్య మెట్ల మార్గంలో కాలినడన ‘సేవ్ ఆర్డీటీ’ నినాదంతో వెళ్లారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు తలారి రంగయ్య మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్ 21 నుంచి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ అంశంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. అప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రజల తరఫున ఆర్డీటీ సంస్థ కోసం పోరాటం చేస్తోందన్నారు. మే నెలలో బైక్ ర్యాలీ చేపట్టి నియోజకవర్గ ప్రజలను చైతన్యవంతులను చేశామని, జూన్‌లో పాదయాత్ర ద్వారా నేతలకు కనువిప్పు కలిగేలా చేశామని చెప్పారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా 1969 నుంచి పేదరికాన్ని రూపుమాపుతున్న సంస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపునకు దిగాయన్నారు. రెన్యువల్ వస్తుందని చంద్రబాబు, లోకేష్‌తో చర్చించామని టీడీపీ నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే వైద్యం, వ్యవసాయ, మహిళా రంగాలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మరోసారి సేవ్ ఆర్డీటీ కార్యక్రమం పేరుతో శాంతియుత ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణ, డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మయ్య, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, యాక్టివిటీ జిల్లా కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక కార్యదర్శి టైలర్ వన్నూరుస్వామి, పార్టీ కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, పాలబండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీలు చంద్రశేఖర్‌రెడ్డి, భీమేష్, సీనియర్ నాయకుడు వన్నూర్‌రెడ్డి, వివిధ విభాగాల తాలూకా అధ్యక్షులు నాగలక్ష్మి, అభిలాష్ రెడ్డి, నరసింహులు, తిప్పేస్వామి, నరేష్, రామిరెడ్డి, మంజు, భాస్కర్, మల్లికార్జున, పాండు, కై రేవు గంగాధర్, వైస్ ఎంపీపీ వెంకటేష్ నాయక్, గోపాల్ రెడ్డి, బసవరాజు, రాము, కేశవ్‌గౌడ్, కొండాపురం రాము, రామ్మోహన్, గంగాధర్, జిన్నా మల్లికార్జున, తిమ్మారెడ్డి, శంకర్ నాయక్, జానీ, మల్లికార్జునతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


