సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

Feb 15 2026 7:23 AM | Updated on Feb 15 2026 7:23 AM

సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

గుత్తి రూరల్‌: దేశంలో ధర్మం, సమాజాభివృద్ధి, గో సంరక్షణకు పాటుపడి బంజారాల ముద్దు బిడ్డగా విరాజిల్లుతున్న సేవాలాల్‌ మహరాజ్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సంత్‌ శ్రీ సేవాలాల్‌ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, జాతీయ ఎస్టీ కమిషన్‌ జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ పిలుపునిచ్చారు. గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్‌లో శనివారం రాత్రి సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 287వ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు జ్యోతి ప్రజ్వలన చేసి, టెంకాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు మాట్లాడుతూ సేవాలాల్‌ మహరాజ్‌ జీవన విధానాన్ని గిరిజనులు అలవర్చుకోవాలన్నారు. జల్‌ (నీరు), జమీన్‌ (భూమి), జంగల్‌ (అడవి) అనే నినాదంతో సేవాలాల్‌ గిరిజనుల హక్కుల కోసం పోరాడారన్నారు. అంతటి మహనీయుని ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. సేవాగఢ్‌ను పవిత్ర పుణ్యక్షేత్రం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బంజారా నాయకులతో కలసి విద్యా హబ్‌గా చేస్తామన్నారు. ట్రస్టు ఉపాధ్యక్షుడు కేశవనాయక్‌ మాట్లాడుతూ సేవాగఢ్‌ ఆలయ అభివృద్ధిని తాము ముందుండి నడిపిస్తామని చెప్పారు. ఇక్కడ బంజారా యూనివర్సిటీ, ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఉత్సవాలకు వచ్చిన ముఖ్య అతిథులను బంజారాల సంప్రదాయ తలపాగ (పగిడి)లతో ప్రత్యేకంగా సన్మానించారు.

సన్మార్గంలో నడవండి

బంజారాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని భారత్‌ సాధు సమాజ్‌ గురూజీ చేతన్‌ గిరి మహరాజ్‌ సూచించారు. బంజారాలు ముందుగా సేవాలాల్‌ మహరాజ్‌ ఉత్సవ విగ్రహాలతో అలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం విగ్రహాన్ని ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ పరిసరాలన్ని కిటకిటలాడాయి. ఉత్సవాలలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవీంద్రనాయక్‌, బంజారా ముఖ్యనేతలు అశ్వత్థనాయక్‌, శేఖర్‌నాయక్‌, హరిలాల్‌ నాయక్‌, ఠాగూర్‌ నాయక్‌, ఎంపీడీఓ ప్రభాకర్‌నాయక్‌, తహసీల్దార్‌ పుణ్యవతి, డిప్యూటీ ఎంపీడీఓ నరసింహారెడ్డి, ఫైర్‌ ఆఫీసర్‌ అశ్వర్థ, డీఎస్పీ శ్రీనివాస్‌, గుత్తి సీఐ రామారావు, ఎస్‌ఐలు సురేష్‌, అమీర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement