గణిత ప్రయోగం సృజనత్మాక అధ్యయనం
సృజనాత్మక విద్యా విధానమే విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహపడుతుందని భావించారు ఆ ఉపాధ్యాయుడు. గణితమంటే విద్యార్థుల్లో సహజంగా ఉండే భయాన్ని దూరం చేసేందుకు వినూత్నంగా ఆలోచించారు.... ఆచరణలో పెట్టారు. ఫలితం గణితం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమమైంది. అరుదైన ఈ ప్రక్రియతో విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఉరవకొండలోని ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్.
ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో చాలా మందికి గణితం అంటే విపరీతమైన భయం. దీంతో చాలా మంది గణితంలోనే పరీక్ష తప్పుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఉరవకొండలోని శ్రీకరిబసవస్వామి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు ఆకుతోట చంద్రశేఖర్ వినూత్నంగా ఆలోచించారు. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగేలా, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అతి సులువుగా గణితం అభ్యసించేలా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ సహకారంతో ప్రత్యేకంగా ఓ మ్యాథ్స్ ల్యాబ్‌నే పాఠశాలలో ఏర్పాటు చేశారు.
ఆకట్టుకుంటున్న నమూనాలు
సైన్స్ ల్యాబ్ తరహాలోనే ఓ గదిలో ప్రత్యేకంగా ఏర్పాటైన మ్యాథ్స్ ల్యాబ్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విద్యార్థులు అత్యంత కష్టంగా భావించే వర్గమూలాలు, కారణాంక విభజనలు, త్రికోణమితికి సంబంధించిన ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేసి ల్యాబ్‌లో ఉంచారు. రోజూ ఓ గంట పాటు 8, 9, 10 విద్యార్థులకు ల్యాబ్‌లో గణితంపై ప్రత్యేక అభ్యసనా శిక్షణ ఉంటుంది. యాక్టివిటీ కార్డు సాయంతో టచ్ చేసి పాఠ్యాంశాలపై సులువుగా అవగాహన పొందేలా నమూనాలు సిద్ధం చేశారు. ప్రతి నమూనా ఎక్కువ అధ్యాయాలతో సహ సంబంధం కలిగి ఉండేలా రూపొందించారు. విద్యార్థిలోని లోపనివారణ మార్గంగా ఈ ల్యాబ్ ఉపయోగపడుతోంది.
వినూత్న ఆలోచనకు ఉత్తమ అవార్డు
‘టచ్ ఎంజాయ్ అండ్ లెర్న్ మ్యాథ్స్’ పేరుతో రూపొందించిన మ్యాథ్స్ ల్యాబ్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు దక్కింది. దీంతో ల్యాబ్ రూపకర్త చంద్రశేఖర్‌కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. ఇటీవల దక్షిణ భారత టీచర్స్ ఎగ్జిబిషన్‌లోనూ ప్రాతినిథ్యం వహించిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్.. తన ప్రదర్శనలకు ఉత్తమ అవార్డులను కై వసం చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 20న జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్‌లో ఉత్తమ ప్రదర్శనగా నిలిచి మొదటి బహుమతిని, అదే నెల 23, 24, 25 తేదీల్లో విజయవాడ వేదికగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి బహుమతిని దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకటకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ నెల 19, 20, 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరిగిన దక్షిణ భారత విద్యావైజ్ఞానిక పోటీల్లోనూ అద్భుతాలను ఆవిష్కరించి ఉత్తమ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్, ఇతర ప్రభుత్వ ప్రతినిధుల చేతుల మీదుగా ఆయన అందుకున్నారు.
భయాన్ని వీడితే గణితం సులువే
సాధారణంగా విద్యార్థులు తమలోని భయాన్ని వీడితే గణితం చాలా సులువుగా మారుతుంది. వారు కష్టంగా భావించే వర్గమూలాలు, కారణాంక విభజనలను సులువుగా అభ్యసన చేసేలా టచ్ ఎంజాయ్ అండ్ లెర్న్ మ్యాథ్స్ కాన్సెఫ్ట్‌తో ప్రత్యేకంగా గణిత ల్యాబ్‌ను సిద్ధం చేశాను. విద్యార్థులు సిలబస్‌తో సంబంధం లేకుండా భావనల ఆధారంగా అర్థం చేసుకుంటూ తమలోని నైపుణాలను అభివృద్ధి పరుచుకుంటున్నారు.
– ఆకుతోట చంద్రశేఖర్,
గణిత ఉపాధ్యాయుడు, ఉరవకొండ
‘టచ్ ఎంజాయ్ అండ్ లర్న్ మ్యాథ్స్’తో విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి
రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్న ఉరవకొండ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్


