నేటి నుంచి విప్రమలై నారసింహ స్వామి ఉత్సవాలు
రాయదుర్గంటౌన్: విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ప్రాచీన వైష్ణవ దేవాలయాల్లో ఒక్కటైన రాయదుర్గం మండలం మల్లాపురం పంచాయతీ పరిధిలోని విప్రమలై కొండల్లో ఉన్న లక్ష్మీ నవ నారసింహస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు రామ్మూర్తి స్వామీజీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం విశేష అభిషేకాలు, కలస స్థాపన, ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సాయంత్రం శ్రీవారి వివాహ నిశ్చయ తాంబూల స్వీకారం ఉంటుంది. 31న శ్రీవారి కల్యాణోత్సవం అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు ఉంటాయి. అంతకు ముందు మండల దీక్షా హోమం, మాలాధారణ కార్యక్రమాలు ఉంటాయి. ఫిబ్రవరి 1న ఉదయం బ్రహ్మరథోత్సవాన్ని నిర్వహిస్తారు.
‘పీఆర్సీని తక్షణమే నియమించాలి’
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని తక్షణమే నియమించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆ సంఘం కార్యాలయంలో ఎస్టీయూ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడారు. ఎస్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 12వ పీఆర్సీ ఏర్పాటు, 30 శాతం ఐఆర్ మంజూరు, డీఏల బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు, ఉద్యోగ విరమణ అనంతరం మరుసటి రోజునే పెన్షన్ సౌలభ్యాల చెల్లింపు తదితర మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ చేపట్టనున్న దశల వారీ పోరాట కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


