పట్టా భూములపై టీడీపీ నేతల కన్ను
● న్యాయం చేయాలంటూ బాధితుల వేడుకోలు
విడపనకలు: సొంత పట్టా భూమిలోకి కాలు కూడా పెట్టనివ్వకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ విడపనకల్లు మండలం వి.కొత్తకోట గ్రామానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. బాధితులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన చిన్న వలి సాహెబ్, పెద్ద వలి సాహెబ్ కుటుంబానికు బడేషావలి దర్గా సమీపంలో సర్వే నంబర్ 703లో 10.34ఎకరాలు సొంత పట్టాభూమి ఉంది. ఇందులో 3.34 ఎకరాలను 2002లో శ్మశాన వాటిక కోసం దానం చేశారు. ఆ సమయంలోనే ముస్లిం మత పెద్దల సమక్షంలో మిగిలిన 6ఎకరాల్లో రాకపోకలు సాగించేలా పూర్వపు రస్తానే కొనసాగించేలా రాయించుకున్నారు. ఇటీవల కొంత భూమిని విక్రయించేందుకు సిద్ధం కాగా, స్థానిక టీడీపీ నేతలు హోతూ మహమ్మద్, ఆదాంవలి, బాబావలి, హుస్సేన్, షెక్షావలితో పాటు మరో పది మంది ఏకమై భూమిని కాజేసేందుకు వారికి తప్ప ఇతరులకు ఎవరికీ అమ్మరాదంటూ దౌర్జన్యానికి దిగారన్నారు. దీంతో న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఉరవకొండ సర్కిల్ ఇన్‌కసపెక్టర్ మహానంది, విడపనకల్లు ఎస్‌ఐ ఖాజా హుస్సేన్, డిప్యూటీ తహసీల్దారు చంద్రమోహన్, సిబ్బంది గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. అయితే టీడీపీ నాయకులకే అధికారులు వత్తాసు పలికి తమకు అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.


