సిట్ నివేదిక చంద్రబాబుకు చెంపపెట్టు
● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ
ఉరవకొండ: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక సీఎం చంద్రబాబుకు చెంపపెట్టులా మారిందని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ తిరుమల లడ్డు కల్తీపై లోతైన దర్యాప్తు చేసిందన్నారు. ఈ క్రమంలో ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టమైన నివేదికను ఇచ్చిందన్నారు. కేవలం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తన స్వార్థ ప్రయోజనాల కోసం అప్పటి విపక్ష నేత చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల లడ్డు ప్రసాదంపై దుష్ప్రచారాన్ని సాగించారనేది స్పష్టమైందన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి, తిరుమల ప్రతిష్ఠకు భంగం కల్గించేలా చంద్రబాబు, పవన్‌లు వ్యవహరించారన్నారు. ఇంతలా దిగజారి వ్యవహరించిన చంద్రబాబు తక్షణ తన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


